అసెంబ్లీలో చంద్రబాబుకు తీవ్ర అన్యాయం(CBN INCIDENT IN ASSEMBLY) జరిగిందంటూ కె.విజయకృష్ణ అనే హెడ్ కానిస్టేబుల్ కన్నీటి పర్యంతమైన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురై తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన వీడియోలో ప్రకటించారు. ప్రస్తుతం కోమటినేని విజయకృష్ణ వేకెన్సీ రిజర్వ్‌లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో తనకు ఉద్యోగం వచ్చిందని.. శాసనసభలో జరిగిన చర్చల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి కుటుంబ సభ్యులపై అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తీవ్ర పదజాలం ప్రయోగించడం తనను మనస్తాపానికి గురిచేసిందని పేర్కొన్నారు.
నైతిక విలువలు, నిబద్ధత లేని ఈ ప్రభుత్వంలో ఉద్యోగం చేయడానికి సిగ్గుపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పోలీసు శాఖ పరిస్థితి దారుణంగా తయారైందని.. సాష్టాంగ పడి పోస్టింగులు తెచ్చుకునే స్థాయికి దిగజార్చే నీచ సంస్కృతిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మోకరిల్లే పోలీసింగ్ చేయడం ద్వారా వచ్చే డబ్బుతో తన బిడ్డలకు తిండి పెట్టవద్దనిపించినట్లు పేర్కొన్నారు. శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలతో తనకీ ఉద్యోగం వద్దనిపించి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజల ముంగిటే వలువలు విప్పేస్తున్నా.. అంటూ తన బెల్టు, టోపీ తీసి పక్కన పెట్టారు. అయితే ఆయన తన రాజీనామా పత్రాన్ని ఉన్నతాధికారులకు అధికారికంగా అందజేయలేదని సమాచారం.
వీడియోలో ఏముందంటే...?
నేను కె.విజయకృష్ణ. 1998 బ్యాచ్‌లో సివిల్ కానిస్టేబుల్‌గా ప్రకాశం జిల్లాలో రిటర్న్ టెస్ట్ టాపర్‌గా సెలెక్ట్ అయ్యాను. చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాకు ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా.. ఎక్కడా చేయి చాచింది లేదు. నీతి, నిజాయితీతో ఉద్యోగం చేస్తున్నాను. ఎవరు, ఎక్కడ కనుక్కున్నాగానీ.. అందరికీ తెలుసు నేనేంటో.
కానీ.. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు పోలీసులకు తెలుసు. ఆంధ్రప్రజానీకానికీ తెలుసు. ఇప్పుడు నేను హెడ్ కానిస్టేబుల్. ఈరోజు అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన మీ అందరికీ తెలిసిందే. ఎంత హృదయవిదారకమైనటువంటి సంఘటన అంటే.. నైతిక విలువలు, నిబద్ధత కోల్పోయిన ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా మాట్లాడడం తప్పు. వాళ్ల దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నానంటే.. నాకే సిగ్గుగా ఉంది. - కె.విజయకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్
హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
పోలీసు శాఖపై వ్యాఖ్యలు చేసిన హెడ్ కానిస్టేబుల్ కె.విజయకృష్ణను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి: Buildings collapsed: కదిరిలో విషాదం.. భవనాలు కూలి ముగ్గురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు