ఏపీ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ తొలిదశ టెండర్ల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిలు షరతులను సడలించాలని కోరుతూ ఐఆర్ఎస్ అధికారి కోగంటి సాంబశివరావు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై తొందరగా విచారించాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది . వ్యాజ్యాన్ని మూడు వారాలకు వాయిదా వేసింది . హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి .రమేశ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఫైబర్ నెట్ టెండర్ల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సాంబశివరావుకు ఈ ఏడాది సెప్టెంబర్ 20 హైకోర్టు బెయిలు మంజూరు చేసింది . అభియోగపత్రం దాఖలు చేసేంత వరకు మంగళగిరి సీఐడీ పీఎస్ వద్ద ప్రతి ఆదివారం హాజరుకావాలని షరతు విధించింది. దర్యాప్తునకు సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేయకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది.
ఎస్ఏహెచ్ ముందు ప్రతి ఆదివారం హాజరు కావాలని న్యాయస్థానం షరతు విధించిన నేపథ్యంలో దానిని సడలించాలని కోరుతూ కె.సాంబశివరావు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్ న్యాయమూర్తి వద్దకు విచారణకు వచ్చింది . పిటిషనర్ తరపు న్యాయవాది అదనపు వివరాలతో మెమో దాఖలు చేశామన్నారు . విచారణను వచ్చే వారం చేపట్టాలని కోరారు . అందుకు నిరాకరించిన న్యాయమూర్తి .. అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తంచేస్తూ మూడు వారాలకు వాయిదా వేశారు .
ఇదీ చదవండి: APSRTC: పల్లె బస్సులకు కొత్త సొబగులు.. ఆదాయం పెంచుకునేలా చర్యలు