పట్టణాల్లో మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) కోసం ఏర్పాటు చేసే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో కుటుంబానికో ఇంటి స్థలం కేటాయించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) మార్గదర్శకాల ప్రకారం వార్షికాదాయం రూ.18 లక్షల్లోపు ఉన్నవారంతా ఈ ప్లాట్లకు దరఖాస్తు చేసుకోడానికి అర్హులని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో నివసిస్తూ 18 ఏళ్లు దాటినవారు దరఖాస్తు చేసుకోవచ్చని బుధవారం జారీచేసిన మార్గదర్శకాల్లో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పేర్కొంది.
ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కంటే తక్కువ ధరకు పట్టణాల్లో మధ్య ఆదాయవర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పథకం కోసం పుర, నగరపాలక సంస్థల్లో ఇటీవల నిర్వహించిన డిమాండు సర్వేలో 3.79 లక్షల మంది ఆసక్తి కనబరిచినట్లు గుర్తించారు. పట్టణాలకు ఐదు కిలో మీటర్లలోపు ఏర్పాటుచేసే ఎంఐజీ లేఅవుట్ల కోసం వివిధ ప్రభుత్వశాఖలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల అవసరాల కోసం గతంలో కేటాయించి, వినియోగించని భూములను బదిలీ చేయాలని ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన స్పందన సమావేశంలో కలెక్టర్లను ఆదేశించింది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం
అర్హులైన మధ్య ఆదాయవర్గాల నుంచి పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ)లు త్వరలో దరఖాస్తులు ఆహ్వానించనున్నాయి. భూ సమీకరణ, సేకరణ ప్రక్రియ పూర్తయి లేఅవుట్లపై స్పష్టత వచ్చాక దరఖాస్తుల స్వీకరణపై పట్టణాభివృద్ధి సంస్థల అధికారులు ప్రకటన చేయనున్నారు. లేఅవుట్లలో స్థలాలను మూడు కేటగిరీల్లో (150, 200, 240 చదరపు గజాలుగా) అభివృద్ధి చేస్తారు. వీటి ధరను రాష్ట్ర స్థాయి ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. లాటరీ తీసి దరఖాస్తుదారులకు ప్లాట్లు కేటాయించనున్నారు. లేఅవుట్లలో రోడ్లు, కాలువలు, తాగునీటి సదుపాయం, భూగర్భ మురుగునీటి వ్యవస్థ (యూజీడీ), వరద నీటి కాలువలు, వీధి దీపాలు, ఉద్యానవనాలు వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
డబ్బు మూడు వాయిదాల్లో చెల్లించే అవకాశం
ప్లాట్ కేటాయించాక దరఖాస్తుదారులు 3 వాయిదాల్లో సొమ్ము చెల్లించాలి. దరఖాస్తు చేసే సమయంలో ప్లాటు మొత్తం విలువలో 10% జమ చేయాలి. అగ్రిమెంటు చేసుకున్న నెలరోజుల్లో మరో 30%, ఆరు నెలల్లో ఇంకో 30%, ఏడాదిలో మిగిలిన 30% చెల్లించాలి. అగ్రిమెంటు చేసుకున్న నెల రోజుల్లో మొత్తం సొమ్ము ఒకేసారి చెల్లిస్తే 5% రాయితీ ఇస్తారు. గడువులోగా వాయిదాలు చెల్లించకపోతే 0.5% వడ్డీ చెల్లించాలి. ప్రతి లేఅవుట్ ఏపీ రెరాలో నమోదుచేసి అభివృద్ధి చేసే బాధ్యతను పట్టణాభివృద్ధి సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది.
ఇదీ చదవండి:
Jagananna Vidya Deevena: 'జగనన్న విద్యా దీవెన'.. నేడే రెండో విడత నిధుల విడుదల
Ap debts: ఒక్క నెలలోనే.. 'ఆర్నెల్ల అప్పు'.. కాగ్ పరిశీలనలో వెల్లడి!