కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్‌కు తెలంగాణ గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. దేశీయంగా మొదటి వ్యాక్సిన్ అభివృద్ధి చేసినందుకు ప్రశంసించారు. కరోనా’ వైరస్‌కి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకాకు మొదటి- రెండో దశ క్లినికల్ పరీక్షల నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. ప్రీ-క్లినికల్ అధ్యయనాలకు సంబంధించి.. తాము పంపిన సమాచారం ఆధారంగా పరీక్షలకు డీసీజీఐ అనుమతి ఇచ్చినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడించింది.
మొదటి-రెండో దశ క్లినికల్ పరీక్షలను వచ్చే నెలలోనే మనుషులపై నిర్వహిస్తామని పేర్కొంది. ‘కొవాగ్జిన్’ టీకాను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సార్స్- కోవ్- 2 వైరస్ స్ట్రెయిన్‌ను ఎన్‌ఐవీ.. భారత్ బయోటెక్‌కు బదిలీ చేసింది. తదనంతరం హైదరాబాద్ సమీపంలోని భారత్ బయోటెక్‌కు చెందిన బయో సేఫ్టీ లెవల్ - 3 ప్రయోగశాలలో టీకాను తయారు చేశారు.
ఇదీ చదవండి: 59 చైనా యాప్‌లపై నిషేధం