ప్రభుత్వం రుణాలు నిలిపేయడంతో రెండేళ్లలో సుమారు లక్ష మంది వరకు బీసీలు నష్టపోయారని బీసీ సంఘాల నేతలు చెబుతున్నారు. 2014-15 నుంచి 2017-18 వరకు కార్పొరేషన్ల ద్వారా 3,15,154 మందికి రూ.1,626.43 కోట్ల వరకు సాయం అందింది. 2018-19 కోసం రూ.1,030.44 కోట్లు కేటాయించారు. 2019లో ప్రభుత్వం మారాక ఈ రుణాలను రద్దు చేశారు. ఈ సాయాన్ని కూడా కలిపితే మొత్తం ఐదేళ్లలో రూ.2,656.47 కోట్లు కేటాయించారు. ఇదంతా ప్రభుత్వం తన వాటాగా ఇచ్చింది మాత్రమే. బ్యాంకుల వాటా కలిపితే ఈ సొమ్ము రెట్టింపవుతుంది.
ఉదాహరణకు ఒక యూనిట్ ఏర్పాటుకు లబ్ధిదారునికి రూ.5 లక్షల వ్యయమైతే అందులో ప్రభుత్వ సబ్సిడీ 2.5 లక్షలు(50%) కాగా, మిగతా రూ.2.5 లక్షల్ని(50%) బ్యాంకులు రుణంగా ఇస్తాయి. మొత్తం యూనిట్ల ఏర్పాటుకు గత ప్రభుత్వం 50% కింద ఇచ్చిన సబ్సిడీ రూ.1,626.43 కోట్లకు... బ్యాంకులు 50% కింద ఇవ్వాల్సిన వాటిలో కనీసం 25% నిధులు రుణం కింద విడుదల చేసినా ఈ వ్యయం రూ.2,439.64 కోట్లకు చేరుతుంది. అయిదేళ్లలో ఏటా సగటున 60 వేల మందికిపైనే లబ్ధి పొందారు. ఇవికాకుండా బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాల కోసం 2016లో ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మిగతా వర్గాలకు 50% వరకు రాయితీతో రుణాలివ్వగా.. ఎంబీసీలకు 90% రాయితీతో రుణాలు ఇచ్చేది. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 21,711 మంది రూ.84 కోట్ల మేర లబ్ధి పొందారు.
అర్ధంతరంగా నిలిపివేత
బీసీ కార్పొరేషన్ ద్వారా 2019-20కి సంబంధించి రాయితీ రుణాల జారీకి అధికారులు ప్రక్రియ ప్రారంభించారు. దరఖాస్తుల పరిశీలన ఎప్పుడు పూర్తి చేయాలి.. రుణాలు ఎప్పుడివ్వాలి.. యూనిట్లు ఎప్పుటిలోగా ఏర్పాటుకావాలి వంటి వాటన్నింటికీ షెడ్యూలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రెన్యువల్, కొత్తవి కలిపి 6,93,914 దరఖాస్తులు రాగా.. జిల్లా, మండల స్థాయిలో పరిశీలించి కొన్నిచోట్ల అర్హులకు ముఖాముఖీలు నిర్వహించారు. ఇంతలోనే ప్రక్రియ మొత్తం నిలిపేయాలంటూ ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలిచ్చింది. అనంతరం ఎలాంటి ముందడుగు పడలేదు. ఫలితంగా 6.9 లక్షల మందికి నిరీక్షణే మిగిలింది. 2018-19కి సంబంధించి ఎంపికైన వారికీ ప్రభుత్వం రుణాలు విడుదల చేయలేదు. జాబితాలో ఎక్కువ మంది అనర్హులున్నందున వాటిని రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు.
ప్రత్యేక భరోసా ఏదీ..?
గతంలో వెనుబడిన వర్గాలకు బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లతోపాటు ప్రభుత్వం ప్రత్యేక పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించేది. విద్యార్థులకు విదేశాల్లో చదివేందుకు రూ.15 లక్షల సాయం, నిరుద్యోగులకు ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా సివిల్స్‌లో ఉచిత శిక్షణ, నెలవారీ భృతి, స్టడీ సర్కిళ్ల ద్వారా పోటీ పరీక్షలకు శిక్షణ, ఆదరణ-2 ద్వారా కులవృత్తులు చేసుకునేవారికి 90% రాయితీతో ఆధునిక పరికరాలు వంటి కార్యక్రమాలుండేవి. ప్రస్తుతం ఇవేవీ అమలు చేయడం లేదు. సొంత దుకాణాలున్న నాయిబ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు ఏటా రూ.10 వేల సాయం ఇచ్చే ‘జగనన్న చేదోడు’ మినహా... వివిధ వర్గాలకు అందుతున్న పథకాలే బీసీలకూ అమలవుతున్నాయి.
కార్పొరేషన్లు పెరిగినా.. ప్రయోజనం సున్నా
* గతంలో బీసీలకు కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలతోపాటు 11 కులాల కోసం ఏర్పాటు చేసిన ఫెడరేషన్ల ద్వారా సాయం అందింది. 10-15 మంది ప్రాథమిక సంఘంగా ఏర్పడి, సహకార చట్టం కింద నమోదు చేసుకుంటేనే ఆర్థిక సాయం లభించేది.
* ఇలా ఎక్కువ మందికి లబ్ధి అందడం లేదని 2019లో ప్రభుత్వం 11 ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చింది. మరో 13 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది.
* బీసీ, ఎంబీసీ వంటివాటితో కలిపి మొత్తం కార్పొరేషన్ల సంఖ్య 26కు చేరింది. 2020లో వీటిని 56కు పెంచింది.
* కార్పొరేషన్ల సంఖ్య భారీగా పెరిగినా ఆయా వర్గాలకు సాయం అందడం లేదు. రైతు భరోసా, వైఎస్‌ఆర్ చేయూత వంటి పథకాల సాయాన్నే వీటి ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నారు. దీంతో కార్పొరేషన్లు విధుల్లేని సంస్థలుగా మారాయి.
ఇవీచదవండి.