రాష్ట్ర ప్రభుత్వం ‘విద్యాకానుక’ కింద అందించే బూట్లు, ఏకరూప దుస్తుల ధరలు గుత్తేదార్లు రింగ్ కావడంతో భారీగా పెరిగాయి. గతేడాదితో పోల్చితే సాక్సులతో కలిపి జత బూట్లకు అదనంగా రూ.51, ఏకరూప దుస్తులకు రూ.155 చొప్పున పెరిగింది. ప్రభుత్వంపై రూ.92 కోట్లు అదనంగా భారం పడుతోంది. పాఠశాలలు పునఃప్రారంభ సమయంలో విద్యార్థులకు విద్యాకానుక కింద 3 జతల ఏకరూప దుస్తులు, బ్యాగ్, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు అందిస్తున్నారు. వీటి సేకరణకు సమగ్ర శిక్ష అభియాన్ టెండర్లు నిర్వహిస్తోంది. గతేడాది వరకు బూట్లకు రాష్ట్రం మొత్తానికి ఒకే టెండర్ పిలవగా.. ఈసారి రెండు జోన్లుగా విడగొట్టారు. రివర్స్ టెండరింగ్ సైతం నిర్వహించారు. గతేడాది జత బూట్లను రూ.124 చొప్పున అందించగా, ఈసారి కూడా అదే సంస్థ సుమారు రూ.175కు కాంట్రాక్టు దక్కించుకుంది. కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్న 2020లోనూ జత బూట్లు రూ.160 చొప్పున అందించారు. 2021లో రూ.124కే సరఫరా చేయడంతో ప్రభుత్వానికి నిధులు భారీగా మిగిల్చినట్లు సమగ్రశిక్ష అభియాన్ అప్పట్లో చెప్పుకొంది. ఈసారి ఏకంగా ఒక్కో జతపై రూ.51 అదనంగా చెల్లించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 45.80 లక్షల మంది విద్యార్థులున్నారు. రూ.51 ఎక్కువగా చెల్లించడం వల్ల కేవలం బూట్లకే ప్రభుత్వంపై రూ.23.35 కోట్ల అదనపు భారం పడుతోంది. గత రెండేళ్లు బూట్లను పాఠశాలలకు సరఫరా చేసేటప్పుడు నాణ్యత తనిఖీ కోసం చెన్నై, దిల్లీ ప్రయోగశాలలకు పంపించేవారు. ఈసారి టెండర్లకు ముందే తనిఖీ చేయించగా, బాటాతో పాటు మరో కంపెనీవి నాణ్యంగా లేవంటూ పక్కనపెట్టారు.
కొలతల తేడాతో సమస్యే..బూట్ల సరఫరా క్షేత్రస్థాయిలో అస్తవ్యస్తంగా మారుతోంది. విద్యార్థుల పాదాల కొలతల్లో తేడా కారణంగా సరిగా సరిపోవడం లేదు. గుత్తేదార్లు ఒకేసారి భారీగా ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత సైజులపై ఎవరూ దృష్టిపెట్టడం లేదు. సైజులు సరిగా లేవని పాఠశాలల నుంచి వెనక్కి పంపితే తిరిగి రావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొలతలు సరిపోలేదని గతేడాది కొందరు విద్యార్థులకు బూట్లే ఇవ్వలేదు. కొత్తగా కొలతలు తీసుకొని, పాతవాటిని మార్చి ఇస్తామని చెబుతున్నా ఇదీ అమలు కావడం లేదు. చాలా పాఠశాలల్లో విద్యార్థులు చెప్పులతోనే వస్తున్న సంగతి ఉన్నతాధికారుల తనిఖీల్లోనూ బయటపడింది. విద్యాకానుక పంపిణీ సమయంలో వీటిపై హడావుడి చేసి, తర్వాత మూలకు పడేస్తున్నారు. కేవలం విశాఖపట్నం జిల్లాలోనే 10వేల బూట్లు సైజుల్లో తేడా కారణంగా వెనక్కి ఇచ్చేయగా, వాటికి బదులుగా కొత్తవి రాలేదు.
న్యాయసమీక్షకు వెళ్లకుండా.. 3 జతల ఏకరూప దుస్తుల సరఫరాకు గతేడాది సగటున రూ.625 వరకు వెచ్చించగా, ఈసారి టెండర్‌లో రూ.775కు పెంచినట్లు తెలిసింది. రూ.వంద కోట్లకు మించే టెండర్‌ను న్యాయసమీక్షకు పంపించాలన్న నిబంధనను తప్పించుకునేందుకు ఈ టెండర్లను 4 జోన్లుగా విభజించి, ఒక్కోదాని విలువ తగ్గించారు. ఎస్‌ఎస్‌ఏ మొదట 3 జతలకు రూ.700 ధర నిర్ణయించగా గుత్తేదార్లు రూ.750 కోట్ చేసినట్లు సమాచారం. దీంతో ఆ టెండర్లు రద్దు చేశారు. రెండోసారి ధరను రూ.750వరకు పెంచినట్లు తెలిసింది. దీనిపై గుత్తేదార్లు 10శాతం అధికంగా వేయగా, తర్వాత నిర్వహించిన రివర్స్ టెండర్లు, బేరాల్లో సుమారు 4శాతం ఎక్కువకు అంగీకరించారు. దీంతో నాలుగు జోన్లలో కలిపి సగటున రూ.775కు ఖరారు చేశారు. 45.80లక్షల మంది విద్యార్థుల లెక్కన రూ.68.70 లక్షలు అదనంగా చెల్లించనున్నారు.
ఇదీ చదవండి: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇకపై బియ్యం వద్దంటే డబ్బులు!