తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు ఔషధాలు, టీకాలను వేగంగా చేరవేయడానికి త్వరలో డ్రోన్లను వినియోగించనున్నారు. ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’(Medicine from the Sky) అనే ప్రాజెక్టును రాష్ట్రంలో అమలుచేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరహా ప్రయోగం దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో అమలు కానుందని వైద్యవర్గాలు తెలిపాయి. ఈనెల 9 నుంచి అక్టోబరు 10 వరకూ వికారాబాద్ జిల్లాలో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ప్రాజెక్టును కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈనెల 11న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.
స్కైలైన్ ఎయిర్ అనే అంకుర సంస్థ బ్లూ డార్ట్ ఎయిర్‌తో కలసి డ్రోన్లు సమకూర్చి ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు తెలిపాయి. ఒక్కో డ్రోన్ సుమారు 40 కి.మీ. వరకూ ప్రయాణించగలదు. ఇందులో సుమారు 15 కిలోల ఔషధాలు, టీకాల సరఫరాకు వీలుంటుంది. నాణ్యత దెబ్బతినకుండా డ్రోన్‌లో నాలుగు వేర్వేరు బాక్సుల్లో మందులను సర్ది పంపిస్తారు. భూమికి సుమారు 500-700 మీటర్ల ఎత్తులో ఈ డ్రోన్ ప్రయాణిస్తుంది. నెలరోజుల పరిశీలన అనంతరం తదుపరి కార్యాచరణను సిద్ధం చేస్తారని వైద్యవర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి: