Endowment adviser: అనంతపురం జిల్లాకు చెందిన జ్వాలాపురం శ్రీకాంత్‌ను దేవాదాయశాఖ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లు ఉంటారు. శ్రీకాంత్ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు. ఈ సమాఖ్యలో ఉండే ముగ్గురు విడిపోయి, దీన్ని మూడు ముక్కలు చేశారు. ఎవరికి వారు తమనే అధ్యక్షులుగా చెప్పుకొంటున్నారు. వారిలో శ్రీకాంత్ ఒకరు. ఈయన గత ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అనంతపురం నగరపాలక సంస్థ పరిధి సమన్వయకర్తగా కొంతకాలం ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపాలోకి వెళ్లారు. ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖను శాసిస్తున్న ఓ కీలక స్వామీజీకి ఈయన చాలాకాలంగా ముఖ్యమైన శిష్యుడిగా ఉన్నారు. గతంలో ఆయన్ను అనంతపురానికి ఆహ్వానించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన సిఫార్సు ద్వారా తొలుత తితిదే బోర్డు సభ్యుని పదవి కోసం ప్రయత్నించారని తెలిసింది. ఆ అవకాశం రాకపోవడంతో.. సలహాదారు పదవిపై దృష్టి పెట్టారు. చాలాకాలంగా ఈ దస్త్రం పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాస్తవానికి దేవాదాయశాఖలో సలహాదారు పోస్టు ప్రత్యేకంగా లేదని, దానికి విధులు, బాధ్యతలు వంటివి తెలిపే ఉత్తర్వులూ లేవని, దీన్ని రాజకీయ పునరావాసంగానే పరిగణించాలని దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఆలయ సొమ్ముల నుంచి చెల్లింపులు: వార్షికాదాయం రూ.5 లక్షలు దాటిన ఆలయాల నుంచి దేవాదాయ పరిపాలన నిధి (ఈఏఎఫ్) కింద 8% వసూలు చేస్తారు. వీటి నుంచే శ్రీకాంత్‌కు జీతం, ఇతర భత్యాలు కలిపి నెలకు రూ.లక్షన్నరకు పైగా ఇస్తారని అధికారులు చెబుతున్నారు.
ముగ్గురు సలహాదారుల పదవీకాలం మరో ఏడాది పొడిగింపు: రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సలహాదారుల పదవీకాలాన్ని పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఇండస్ట్రియల్ ప్రమోషన్) కృష్ణ జి.వి.గిరితో పాటు, ఐటీ (సాంకేతిక) సలహాదారులు దేవిరెడ్డి శ్రీనాథ్, జె.విద్యాసాగర్‌రెడ్డిల పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం జులై 28న ఉత్తర్వులు జారీ చేసింది. జీవోల్ని ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ఇవీ చదవండి: