Mines Lease: గనుల లీజులపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. చిన్నతరహా ఖనిజాలకు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకుంటే లీజు మంజూరు చేసే విధానం కాకుండా ఈ-వేలం ద్వారా మాత్రమే కేటాయించనుంది. చిన్న తరహా ఖనిజాల వేలంపై విధి విధానాలతో ప్రభుత్వం మార్చి 14న గెజిట్ ప్రచురించింది.
మార్చి 15 నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. రెండంచెల్లో వేలం నిర్వహించి, అత్యధికంగా కోట్ చేసిన వారికే గనులను కేటాయించనున్నారు. ప్రస్తుత లీజుదారులకు ఏడాదిపాటు కొనసాగించే అవకాశం ఇస్తూనే ఆపై పునరుద్ధరణ ఉండదని పేర్కొంది. మళ్లీ ఈ-వేలంలో పాల్గొని గరిష్ఠ ధర చెల్లిస్తేనే కొనసాగవచ్చంటూ పలు నిబంధనలు పొందుపరిచింది.
ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్దేశించిన నిబంధనలివీ...
mines lease: ప్రతి లీజు ఈ-వేలానికి హెక్టారుకు ప్రాథమిక ధర ఎంతో నిర్ణయిస్తారు. తొలుత సాంకేతిక అర్హతలు ఉన్నవారిని అనుమతిస్తారు. తర్వాత వీరిలో ఎక్కువ మొత్తం కోట్ చేసిన సగం మందిని ఎంపిక చేస్తారు. ఇందులో అత్యధికంగా కోట్ చేసిన మొత్తాన్ని ఫ్లోర్ ధరగా పేర్కొని.. దానిపై రెండో రౌండ్‌లో ఈ-వేలం వేస్తారు. అంతకంటే ఎక్కువ ధరకు కోట్ చేసినవారికి లీజు ఖరారు చేస్తారు.
- ఎంపికైన లీజుదారు రెండు వారాల్లో వేలంలో పేర్కొన్న ప్రీమియం మొత్తం చెల్లించాలి. లేకపోతే రెండో స్థానంలో నిలిచిన వారికి అవకాశమిస్తారు.
- ఓ లీజుదారు తనకు కేటాయించిన గనిలో తవ్వకాలు జరిపి లీజు గడువు ముగిసినట్లైతే.. దాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉండదు. గడువు ముగిసి పునరుద్ధరణకు వచ్చే లీజులన్నింటినీ వేలం వేస్తారు.
- అయితే గడువు ముగిసే లీజులకు ఏడాదిపాటు పాత నిబంధనల ప్రకారం తవ్వకాలకు అనుమతిస్తారు. వచ్చే ఏడాది నుంచి వాటికి ఈ-వేలం నిర్వహిస్తారు.
- పాత లీజుదారు వేలంలో పాల్గొన్నప్పటికీ, వేరొకరు అధిక మొత్తం కోట్‌చేస్తే.. అంతే మొత్తాన్ని చెల్లించేందుకు పాత లీజుదారు అంగీకరిస్తే అతనికే కేటాయిస్తారు.
- ఖనిజ రంగాన్ని కొందరి చేతుల్లో పెట్టేయత్నం
"ఇండస్ట్రీ (ఫెమీ)వేలం విధానం ద్వారా ఖనిజ రంగాన్ని కొందరి చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది. బయటకు పారదర్శకంగా కనిపిస్తున్నప్పటికీ.. దాని వెనుక మాయాజాలం ఉంది. ఏ రాష్ట్రంలోనూ వేలం విధానం విజయవంతం కాలేదు. అయినా అమలు చేస్తున్నారు. ప్రస్తుత లీజుదారులకు పునరుద్ధరణ లేకపోతే తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి, యంత్రాల కొనుగోలు చేసి, క్రషర్లు పెట్టుకున్న వారు ఆర్థికంగా నష్టపోతారు." - సీహెచ్.రావు, ప్రధాన కార్యదర్శి, ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్
mines lease: మార్చి 15 నుంచే కొత్త విధివిధానాలు అమల్లోకి రానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి: గోదావరి, కృష్ణా నదుల పునరుజ్జీవానికి రూ.4,027 కోట్లు