కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్ నేపథ్యంలో ఇందులోని అంశాలను ముందుకు తీసుకెళ్లేందుకు నేడు(మంగళవారం) ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశాలు జరగడం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రాలపై ఈ నోటిఫికేషన్ తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందుగా పూర్తి స్థాయి బోర్డు సమావేశంలో సమగ్రంగా చర్చించి తర్వాత సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది.
మొదట సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి తర్వాత వెంటనే బోర్డు సమావేశం ఏర్పాటు చేద్దామని.. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి రావాలంటూ గోదావరి నదీ యాజమాన్య బోర్డు తిరిగి సమాధానమిచ్చింది. గెజిట్ నోటిఫికేషన్ తర్వాత తదుపరి కార్యాచరణ గురించి నివేదించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కోరిందంటూ ఇందుకు సంబంధించిన లేఖను కూడా జత చేసింది. అయితే పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని మొదట నిర్వహించాలన్న తెలంగాణ మంగళవారంనాటి సమావేశానికి హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది.
కృష్ణా బోర్డు సైతం..
కృష్ణా బోర్డు కూడా గోదావరి బోర్డు తరహాలోనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సోమవారం రెండు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. కానీ గోదావరి బోర్డు సమావేశం జరగకపోతే ఇది కూడా జరిగే అవకాశం లేదు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించిన కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ, జులై 15న గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిని ఆంధ్రప్రదేశ్ స్వాగతించగా, తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో గత నెల 28న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి రెండు బోర్డుల ఛైర్మన్లకు లేఖ రాశారు. గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలు నిర్ణయించిన గడువులోగా అమలయ్యేలా కార్యాచరణ చేపట్టాలని కోరారు. కొన్ని రోజులుగా కేంద్ర జల్‌శక్తి మంత్రి, కార్యదర్శి, జలసంఘం ఛైర్మన్లు దీనిపై చర్చిస్తున్నారని, తేదీల వారీగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి పంపాలని సూచించారు. దీని ఆధారంగా బోర్డుతో సంబంధం లేకుండా 11 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన గోదావరి నదీ యాజమాన్యబోర్డు, ఈ కమిటీతో మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం, గోదావరి బోర్డు అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్న దశలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 12 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకోవడంతో పాటు మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. తెలంగాణలో జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ఒకరే కావడంతో గోదావరి బోర్డులో ఇదే విధంగా పేర్కొన్నారు. అయితే కృష్ణా బోర్డు మాత్రం జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీలను వేర్వేరుగా చూపడంతో 12 మంది సభ్యులయ్యారు. సోమవారం రాత్రి పది గంటల వరకు కూడా మంగళవారం జరిగే సమన్వయ కమిటీ సమావేశాల వాయిదా గురించి ఎలాంటి సమాచారం రాష్ట్రాలకు అందలేదు. అయితే మొదట పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని తెలంగాణ కోరినందున, సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: