పోలీసుశాఖకు చెందిన కొందరు దిగువస్థాయి అధికారులు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు(ఎస్‌హెచ్‌వో) చట్ట నిబంధనలు పాటించడంలేదని, విధినిర్వహణలో వారు విఫలమవుతున్నారని హైకోర్టు ఆక్షేపించింది. కొందరి నిర్లిప్తత(ఇన్‌యాక్షన్), విపరీత ప్రవర్తన/అత్యుత్సాహం(ఓవరాక్షన్), ప్రభుత్వానికి సలహాదారులు న్యాయపరమైన సూచనలు సరిగా ఇవ్వని కారణంగా ఉన్నతాధికారులు న్యాయస్థానాల్లో నిలబడాల్సి వస్తోందని కోర్టుకు హాజరైన డీజీపీ గౌతం సవాంగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. చిన్నకేసులో మిమ్మల్ని పిలిపించాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని డీజీపీని కోరింది. మీ నిబద్ధత గురించి తెలుసని.. ఈ కేసులోనూ మీకు న్యాయసలహా సక్రమంగా ఇవ్వకపోవడంతోనే ఇక్కడ నిలబడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించింది. ఏ వ్యక్తికి, అధికారికి, ఏ ప్రభుత్వానికి న్యాయస్థానం వ్యతిరేకం కాదని స్పష్టంచేసింది. కరోనా సమయంలో పోలీసులు చక్కగా సేవలందిస్తున్నారని పేర్కొంది.
న్యాయ సలహాదారులు తగిన విధంగా సహకరించకపోవడం వల్లే కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తోందని తెలిపింది. కొందరు ప్రభుత్వానికి న్యాయస్థానం వ్యతిరేకమా?అనే భావనలో ఉన్నారంది. కోర్టులున్నది రాజ్యాంగ, చట్ట నిబంధనల రక్షణ కోసమేని తెలిపింది. ప్రభుత్వానికి సక్రమమైన సలహాలు, సూచనలు చేయకుండా కోర్టులను నిందిస్తే ప్రయోజనముండదని పేర్కొంది. మద్యం అక్రమ రవాణా కేసులో స్వాధీనానికి గురైన వాహనాల విషయంలో డీజీపీ నుంచి వివరాలు సేకరించి కోర్టుకు తెలపాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్‌ను ఆదేశిస్తే..సహాయ ప్రభుత్వ న్యాయవాది(ఏజీపీ) కోర్టులో మెమో దాఖలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టుకు తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ఏజీది కాదా?అని ప్రశ్నించింది. ఏజీ, ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ), ఏజీపీలు న్యాయస్థానం ప్రతిష్ఠను పెంచేలా వ్యవహరించాలని హితవుపలికింది. కేవలం మెమో దాఖలుచేయడం తప్ప..కోర్టు కోరిన వివరాలు అందులో లేవని ఆక్షేపించింది. ఆ మెమోను స్వయంగా పరిశీలించాలని డీజీపీని కోరింది.
స్వాధీనం చేసుకున్న వాహనాల్ని కేసు రికార్డులతో సహా ఈనెల 24 నుంచి మూడు రోజుల్లోపు సంబంధిత ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్(డీసీ) ముందుంచాలని తేల్చిచెప్పింది. ఆ వాహనాలు డీసీ ముందుకు చేరగానే యజమానులు వాటి కోసం దరఖాస్తులు చేసుకోవచ్చంది. దరఖాస్తులు అందిన మూడురోజుల్లోపు ఎక్సైజ్‌చట్ట నిబంధనల ప్రకారం వాహనాల విడుదలపై ఉత్తర్వులు జారీచేయాలని డీసీని ఆదేశించింది. వారంలో ప్రక్రియ పూర్తిచేయాలంది. డీజీపీని హాజరు నుంచి మినహాయింపునిస్తూ వ్యాజ్యాలన్నింటినీ పరిష్కరించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేశారు.
నిబంధనలకు లోబడి మద్యం తీసుకెళుతున్నప్పటికీ పోలీసులు తమ వాహనాల్ని జప్తుచేశారని, వాటిని విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇటీవల వీటిపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్.. ఎక్సైజ్‌చట్టంలోని సెక్షన్46, సీఆర్‌పీసీ సెక్షన్102 ప్రకారం పోలీసులు ఎందుకు నడుచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాహనాలను మేజిస్ట్రేట్/ఎక్సైజ్ డీసీ ముందుంచక పోవడాన్ని తప్పుపట్టారు. వాహనాల్ని సీజ్ చేసిన అధికారులు చట్టనిబంధనల్ని ఎందుకు పాటించడంలేదు? వారిపై ఏమి చర్యలు తీసుకున్నారో డీజీపీ నుంచి వివరాలు సేకరించి తమ ముందుంచాలని ఏజీని ఆదేశించారు. మంగళవారం విచారణలో కోర్టు కోరిన వివరాలు సమర్పించకపోవడంతో డీజీపీ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీజీపీ హాజరై వాహనాల్ని ఎక్సైజ్ డీసీ ముందుంచే విషయమై కిందిస్థాయి అధికారులకు సర్క్యులర్ జారీచేశామని ప్రమాణపత్రం దాఖలుచేశారు. జాప్యానికి బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకునే నిమిత్తం యూనిట్ అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు. వాహనాల్ని డీసీ ముందుంచేందుకు కొంత సమయం పడుతుందన్నారు.
ఇదీ చదవండి : అచ్చెన్నాయుడి కేసులో అర్ధరాత్రి హైడ్రామా