Mini Theatre Gaali Budaga in Asifabad: తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం ప్రజల సినిమా థియేటర్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఇక నుంచి ఇక్కడి సినీ అభిమానులు సినిమా చూడటానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ సినిమా చూసేందుకు.. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్ పట్టణాలకు వెళ్లేవారు. ఇప్పుడా అవసరం లేదు. మరో రెండు మూడు రోజుల్లో ఇక్కడ ప్రభుత్వ భాగస్వామ్యంతో స్థానికులకు వినోదం పంచే మినీ థియేటర్ అందుబాటులోకి వచ్చింది. నిర్మాణ పనులు దాదాపుగా పూర్తిగా కావొచ్చాయి. గత మూడు దశాబ్దాలుగా సినిమా థియేటర్ లేని జిల్లా కేంద్రంగా ఉన్న ఆసిఫాబాద్ వాసులకు వినోదం కరవైన నేపథ్యంలో కలెక్టర్ పర్యవేక్షణలో సినిమా థియేటర్‌ను ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ అధీనంలోని జిల్లా సమైక్య, పిక్చర్ టైమ్ అనే ప్రైవేటు సంస్థ సాంకేతికత వాటాతో రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేసి స్టార్టప్ మినీ తాత్కాలిక థియేటర్‌ను నిర్మించారు.
మూడు దశాబ్దాల తర్వాత..
గతంలో ఇక్కడ నిర్వహించిన "రామ్" సినిమా టాకీస్ మూడు దశాబ్దాల క్రితం మూతబడింది. అప్పటి నుంచి పట్టణ, సమీప ప్రాంతాల ప్రజలకు సినిమా చూడటం కష్టంగా మారింది. ఇప్పుడు జిల్లా కేంద్రం కావడంతో వేలాది మంది ఉద్యోగులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పట్టణ జనాభా పెరుగుతోంది. కానీ ఇందుకు అవసరమైన వినోదం, ఆహ్లాదం మాత్రం కొరవడింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ప్రజలకు వినోదం అందించడంతో పాటు ఆదాయం సమకూర్చుకునేందుకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో జనకపూర్‌లో "గాలిబుడగ" మినీ థియేటర్ ఏర్పాటు చేశారు. మంగళవారం.. మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఛైర్పర్సన్ కోవ లక్ష్మి.. తదితరులు పాల్గొని థియేటర్‌ను ప్రారంభించారు. మొదటగా అమ్మ సినిమా ట్రైలర్ వేశారు.
ప్రత్యేకతలు..
ఎంత గాలి వీచినా చెక్కుచెదరని విధంగా ఈ మినీ థియేటర్‌ను నిర్మించారు. ఏసీ, వినసొంపైన సౌండ్ సిస్టమ్‌తో మల్టీప్లెక్స్‌ను తలపిస్తోంది. ఎకరం స్థలంలో టాకీస్, ప్రహరీ, మూత్ర శాలలు, ప్లాట్‌ఫామ్, ట్రాన్స్ఫార్మర్, నీటివసతులు ఉన్నాయి. శుక్రవారం రాధేశ్యామ్ సినిమా విడుదలతో అధికారికంగా థియేటర్‌ను ప్రారంభించనున్నారు.
ప్రైవేటు భాగస్వామ్యంతో.. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో..
జిల్లా కేంద్రంలో థియేటర్ ఆవశ్యకతను గుర్తించిన కలెక్టర్, అదనపు కలెక్టర్.. ఆ దిశగా పనులు చేపట్టారు. దిల్లీకి చెందిన పిక్చర్ టైమ్ అనే ప్రైవేటు సంస్థ భాగస్వామ్యంతో.. ఆధునిక సాంకేతికత గాలి బుడగ పరిజ్ఞానంతో, అతి తక్కువ సమయంలో థియేటర్‌ను ఏర్పాటు చేశారు. రూ.50 లక్షల బడ్జెట్లో ఈ ప్రాజెక్టులో సుమారుగా రూ.25 లక్షలు డీఆర్డీఏ పర్యవేక్షణలోని కుమురం భీం మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ (జిల్లా సమాఖ్య)వసతుల కల్పన కోసం భరిస్తుంది. మిగతా 25 లక్షలతో.. పిక్చర్ టైమ్ సంస్థ తాత్కాలిక సినిమా థియేటర్, ప్రొజెక్టర్, 120 కుర్చీలు, 35ఎంఎం తెర, అధునాతన యంత్ర పరికరాలు సమకూర్చింది. ఎకరం స్థలం, ప్రహరీ, మూత్రశాలలు, ప్లాట్ ఫామ్, ట్రాన్స్ఫార్మర్, నీటి వసతులను సొసైటీ కల్పించింది. పూర్తిగా గాలి బెలూన్లా కనిపించే ఈ థియేటర్లో ఏసీ సదుపాయం, ఫ్యాన్లు కూడా ఉన్నాయి. ఇందులో 120 మంది కూర్చొని సినిమాను వీక్షించవచ్చు. ఈ సినిమా థియేటర్ ఆవరణలో పిల్లలకు పార్కు, వ్యాపారపరంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టాకీస్ మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: ONGC: ఓఎన్‌జీసీకి.. "బాహుబలి" రిగ్