వరుణుడి దెబ్బకు అంత్యక్రియలు రహదారి పక్కనే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడుకు కన్నెబోయిన వెంకన్న అనారోగ్యంతో మృతి చెందారు. అతని అంత్యక్రియలు నిర్వహించేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వరదనీటికి వైకుంఠధామం మునిగిపోవడంతో ప్రధాన రహదారి పక్కనే దహన సంస్కారాలు నిర్వహించారు.
హెలికాఫ్టర్ ద్వారా నిత్యావసరాలు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వరదలు ప్రజల జీవితాలను అతలకుతలం చేశాయి. వరద కాస్త తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఇళ్లల్లోకి చేరుతున్నారు. వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది. జిల్లా కలెక్టర్ అనుదీప్ హెలికాప్టర్ ద్వారా ఏజెన్సీ ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని వరద గుప్పెట్లో చిక్కుకున్న అనేక గ్రామాలకు నిత్యావసర వస్తువులు తరలిస్తున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు మందులు, జెట్ కాయిల్స్, పిల్లలకు పాల పదార్థాలు అందిస్తున్నారు. వరదలో చిక్కుకొని సర్వస్వం కోల్పోయిన గిరిజనులకు పంపిణీ చేస్తున్నారు.
వరదొచ్చింది... బురద మిగిలింది: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాల్లో గోదావరి వరద నీరు చేరడంతో వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు రహదారులన్నీ బురద మయంగా మారాయి. కిలోమీటర్ల పొడవునా రోడ్డుపై బంక మట్టి పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గం గుండా పోయే ద్విచక్ర వాహనదారులు బురదలో కింద పడుతున్నారు.
ఒకవైపు అధికారులు రోడ్డుపై ఉన్న బురదను తొలగిస్తున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో వాహనదారులకి కష్టాలు తప్పడం లేదు. ప్రధానంగా సారపాక నుంచి బూర్గంపాడుకు వెళ్లే రోడ్డు మధ్య ఎక్కువ స్థాయిలో బురద పేరుకుపోయింది. సారపాక నుంచి అశ్వాపురం మండలానికి వెళ్లే రోడ్డులో కూడా బురద పేరుకుపోయింది. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని పలు గ్రామాల్లో రోడ్డుపై బంకమట్టి చేరుకోవడంతో వాహనదారులకు అవస్థలు పడుతున్నారు.
ఇవీ చదవండి: