Insects in Basara IIIT mess: ప్రాథమిక అవసరాల్లో ఒకటైన ఆహారం.. నాణ్యతగా ఉన్నప్పుడే విద్యార్థులు చదివేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఆ ఆహారమే సరిగా లేకపోతే.. అది వారి ఆరోగ్యానికే ప్రమాదకరం. తెలంగాణలోని బాసర త్రిపుల్‌ఐటీ మెస్‌లో వరుసగా రెండు రోజులపాటు చోటుచేసుకున్న సంఘటనలు ఆందోళనకు దారితీస్తున్నాయి. నాణ్యమైన, ఉన్నత విద్యకు కేరాఫ్‌గా నిలిచే విశ్వవిద్యాలయంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఆరోగ్యంపై ఆందోళన
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విశ్వ విద్యాలయంలో.. శనివారం ఉదయం టిఫిన్ చేస్తుండగా కూరలో కప్ప వచ్చిందనే వార్త.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అది మరువకముందే ఇవాళ మధ్యాహ్న భోజన సమయంలో కూరలో తోకపురుగు వచ్చిందనే వార్త కలవరపెడుతోంది. కాగా అప్పటికే భోజనం చేసిన విద్యార్థులు.. తమ ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. భోజనం చేయని విద్యార్థులు.. అలాగే పస్తులుండిపోయారు. ఆ ఫొటోలను విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.
మీడియాకు నో పర్మిషన్
కాగా ఈ విషయంపై ఆరా తీసేందుకు యూనివర్సిటీ వద్దకు వెళ్లిన మీడియాను సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించడం లేదు. దీంతో పలు అనుమానాలకు బలం చేకూర్చినట్లుగా ఉంది. పై అధికారులు మీడియాను అనుమతించవద్దని చెప్పారని సిబ్బంది బదులిచ్చారు.
ఇదీ చదవండి: Brijesh Kumar Tribunal: 'ఆ 150 టీఎంసీల నీటిలో 125 మాకే ఇవ్వాలి'