అమరావతి రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంది. సచివాలయంలో రేపు మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొనగా పోలీసులు రైతులకు నోటీసులు జారీచేశారు. ప్రభుత్వం తప్పు చేసిందనే దానికి తమకు నోటీసులు ఇవ్వడమే నిదర్శనమని రైతులు పేర్కొన్నారు. సీఎం, మంత్రులు వెళ్లే రహదారిలో కొత్త వ్యక్తులు గుమికూడేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ చర్యపై మండిపడిన రైతులు తమకు మద్దతుగా వచ్చే వారిని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు.
3 రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ వెలగపూడిలో జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రతులను రైతులు తగలబెట్టారు. జీఎన్ రావు కమిటీ నివేదిక అని మండిపడ్డారు. కమిటీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
8 రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న రాజధానిలో 9వ రోజైన ఇవాళ రైతులు అన్ని ప్రాంతాల్లోనూ నిరసనలు కొనసాగించనున్నారు. మందడం, తుళ్లూరులో మహాధర్నా, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. అన్ని గ్రామాల్లోనూ వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగనున్నాయి.
గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి తమకు అన్యాయం జరగకుండా జోక్యం చేసుకోవాలని అమరావతి రైతులు కోరనున్నారు. రాజధానిగా అమరావతే కొనసాగించాలంటూ వినతిపత్రం సమర్పించనున్నారు.