ఈఎస్ఐ కుంభకోణంపై అనిశా నమోదు చేసిన కేసులో ముందుస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పి. వెంకట సురేశ్, ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీ మోహన్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లలిత.. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది చల్లా అజయ్ కుమార్ వాదనలు వినిపిస్తూ .. ఔషధాల కొనుగోళ్లతో పిటిషనర్లకు ఎటువంటి సంబంధం లేదన్నారు. రాజకీయ కక్షతో వారిని కేసులో ఇరికించారన్నారు.
తండ్రి అధికారాన్ని వెంకట సురేశ్ దుర్వినియోగపరచలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనిశా తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈఎస్ఐ కుంభకోణంలో దర్యాప్తు వేగంగా జరుగుతుందన్నారు. ఈ దశలో పిటిషనర్లకు బెయిల్ మంజూరు చేయొద్దన్నారు. అక్రమాల్లో పిటిషనర్ల పాత్ర ఉందన్నారు. వారు లబ్ధి పొందారన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వాయిదా వేశారు.
ఇదీ చదవండి : తెదేపా కార్యకర్తకు చంద్రబాబు ఫోన్‌కాల్.. ఎందుకంటే?!