దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ల పరిశోధనల పురోగతి, తయారీ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు వచ్చిన 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు... హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో పర్యటించారు. భారత్ బయోటెక్, బయెలాజికల్-ఇ సంస్థలను సందర్శించారు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్ టీకా పురోగతిని తెలుసుకున్నారు. టీకాల తయారీపై దృశ్యరూపక ప్రదర్శనను విదేశీ ప్రతినిధులు తిలకించారు.
భారత్ బయోటెక్ ప్రస్థానం...
కొవాగ్జిన్ పురోగతిని భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా వివరించారు. భారత్ బయోటెక్ ప్రస్థానాన్ని దృశ్యరూపకంగా ప్రదర్శించారు. భారత్ బయోటెక్‌కు పది రోజుల క్రితం ప్రధాని మోదీ వచ్చారని... ఎందరో ప్రముఖులు సందర్శించారని కృష్ణ ఎల్లా సంతోషం వ్యక్తంచేశారు. టీకా రంగంలో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నామన్న ఆయన... కరోనా టీకా తయారీలో భారత్ బయోటెక్ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని తెలిపారు.
క్లినికల్ ట్రయల్స్...
కొవాగ్జిన్ తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో వెయ్యి మంది చొప్పున వాలంటీర్లు పాల్గొన్నారన్న కృష్ణ ఎల్లా... నవంబర్‌లో ప్రారంభమైన మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో 26 వేల మంది భాగస్వామ్యులవుతున్నారని వివరించారు. దేశంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న టీకా... కొవాగ్జిన్ మాత్రమేనన్నారు.
33 శాతం ఇక్కడే...
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న టీకాల్లో హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోనే 33శాతం తయారవుతున్నాయని తెలిపారు. దూరదృష్టితో స్థాపించిన జినోమ్ వ్యాలీ.... దేశంలో కీలకంగా మారిందని కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. కొవాగ్జిన్ తయారీ భారత వాక్సిన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా వ్యాఖ్యానించారు.
కరోనాపై భారత్ పోరాటం చరిత్ర సృష్టిస్తుందని బయోలాజికల్-ఇ ఎండీ మహిమ దాట్ల వ్యాఖ్యానించారు. భారత్‌లో టీకా తయారీకి అవసరమైన మౌలికవసతులు భారీస్థాయిలో ఉన్నాయని తెలిపారు.
కరోనాపై పోరాటంలో భారత్ పాత్ర చరిత్రాత్మకం. కరోనా టీకా కంటే ముందు కూడా భారత్ ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ స్థాయిలో అనేక దేశాలకు టీకాలను అందిస్తోంది. కరోనా విషయంలో కూడా ఇదే పంథా కొనసాగుతుంది. భారత్‌లో టీకా తయారీకి అవసరమైన మౌలికవసతులు భారీస్థాయిలో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థల నిబంధనలను అందుకోవడంలో భారత ఫార్మా సంస్థల తయారీ టీకాలకు మంచి చరిత్ర కూడా ఉంది. అందుకే భారత్ కొవిడ్‌కు పరిష్కారం విషయంలో కీలకపాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
---- మహిమ దాట్ల, బయోలాజికల్ ఇ ఎండీ
జినోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్, బయోలాజికల్-ఇ సంస్థలను సందర్శించిన 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు తమ పర్యటనపై సంతృప్తి వ్యక్తంచేశారు. వ్యాక్సిన్ తయారీ కోసం శాస్త్రవేత్తల కృషి తననెంతో ఆకట్టుకుందన్న డెన్మార్క్ రాయబారి స్వేన్... వ్యాక్సిన్ తయారీ కేవలం వ్యాపార ప్రక్రియ కానేకాదన్నారు. వ్యాక్సిన్ తయారీ ద్వారా ప్రపంచానికి ఎంతో సాయం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అన్ని దేశాలకు వ్యాక్సిన్ అందించే సత్తా ఉన్న దేశం భారత్ ఒక్కటనని ఆస్ట్రేలియా రాయబారి ఫారెల్ వ్యాఖ్యానించారు.
పరిశోధనలు...
కొవిడ్‌పై పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థలకు చెందిన 190 మంది విభాగాధిపతులకు విదేశీ వ్యవహారాల శాఖ నెలక్రితం పలు అంశాల్ని వివరించింది. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ పరిశోధనల పురోగతి, తయారీ సామర్థ్యాన్ని పరిశీలించడానికి రాయబారులు, హైకమిషనర్ల పర్యటనను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఏర్పాట్లు చేసింది.
ప్రపంచానికి సాయం...
కొవిడ్‌పై జరుగుతున్న పోరాటంలో తమకున్న వ్యాక్సిన్ తయారీ సామర్థ్యంతో ప్రపంచానికి సాయం చేస్తామని భారత్ పేర్కొంది. కోల్డ్ చైన్, టీకా నిల్వ సామర్థ్యం పెంపునకు ఈ పర్యటన దోహదం చేస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ భావిస్తోంది. కరోనా సమయంలో 150 దేశాలకు భారత్... మానవతా దృక్పథంతో మందులు సరఫరా చేసింది.
ఇదీ చూడండి: భారత్ బయోటెక్‌ను సందర్శించిన విదేశీ రాయబారులు, హై కమిషనర్లు