భారతీయ మత్స్య పరిశోధన సంస్థ (ఎఫ్‌ఎస్‌ఐ) మ్యూజియం అధ్యయనాలకు దిక్సూచిగా నిలుస్తోంది. వాణిజ్య రకాలైన చేపల్లో అరుదైన నమూనాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మత్స్యకారులు, బోటు యజమానులు ఈ మత్స్య జాతుల గురించి తెలుసుకుని సముద్ర జలాల్లో వేట సాగిస్తున్నారు. చేపలరేవుకు సమీపంలో 1958 సంవత్సరంలో ఎఫ్‌ఎస్‌ఐ సంస్థ ఏర్పాటైంది. రాష్ట్రంలోని మచిలీపట్నం నుంచి పశ్చిమబంగాల్‌లోని సాండ్‌హెడ్స్ వరకు ఉన్న సముద్రజలాలు దీని పరిధిలోకి వస్తాయి. ఎగువ తూర్పుతీరంలోని సముద్ర జలాల్లో అన్వేషణాత్మక పరిశోధనల ద్వారా ఈ సంస్థ అరుదైన మత్స్య జాతులను గుర్తిస్తోంది. ఆయా సందర్భాల్లో లభ్యమైన మత్స్యరాశులతో మ్యూజియం ఏర్పాటైంది.
గాజు జార్లలో భద్రం
* ఎఫ్‌ఎస్‌ఐ జేడీ భామిరెడ్డి ఆధ్వర్యంలో మత్స్య శాస్త్రవేత్తలు ఎ.బి. కర్, జీవీఎ ప్రసాద్, సిలాంబరాసన్ పర్యవేక్షణలో మ్యూజియం కొనసాగుతోంది. ఎఫ్‌ఎస్‌ఐ ట్రాలర్లు చేపట్టే సర్వేలో లభ్యమయ్యే అరుదైన మత్స్యరాశులను విశాఖకు తెచ్చి ఇక్కడ ల్యాబొరేటరీలో పలు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వాటి నమూనాలను గాజు జార్లలో భద్రపరుస్తారు.
ఇలా.. ఆసక్తి
* సైన్స్, మెరైన్ లివింగ్ రిసోర్స్ (ఎంఎల్‌ఆర్) కోర్సులు చేసే వారు ఈ మ్యూజియంను అధికంగా సందర్శిస్తారు. ఏయూ జువాలజీ, ఫిషరీస్ విభాగాల పరిశోధకులు సైతం అధికంగా ఇక్కడికి వస్తారు. అరుదైన మత్స్యరాశులు, అవి లభ్యమయ్యే ప్రాంతాలు సైతం తెలియజేయడంతో వాటి జాడలపై పరిశోధనలు చేసేందుకు పలువురు ఉత్సుకత చూపుతున్నారు. మ్యూజియంలో కొలువుదీరిన మత్స్యరాశులతో ఎఫ్‌ఎస్‌ఐ ఆధ్వర్యంలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి వివిధ కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
* కవళ్లు, కనకర్తలు, చందువాలు, కోనాం, వంజరం, టైగర్ రొయ్యలు, కోరలు, పారలు, గరసలు, గొరకలు వంటి వాణిజ్య రకాలైన చేపల నమూనాలు మ్యూజియంలో ఉన్నాయి. విద్యార్థులు, పరిశోధకులు, మత్స్య పరిశ్రమకు చెందిన వారికి తమ మ్యూజియం ఉపయుక్తంగా ఉందని ఎఫ్‌ఎస్‌ఐ విశాఖ మండల డైరెక్టర్ భామిరెడ్డి తెలిపారు.
కొన్ని జాతుల విశిష్టత ఇలా..

* మొసలి సొర చొరచేప: మొసలి ఆకారంలో ఉన్నందున దీన్ని మొసలి చొర చేప అంటారు. సముద్ర గర్భంలో లభ్యమవుతుంది. దీనిలో చిన్నగా కనిపించే ఫిన్స్‌ను వైద్య అవసరాలకు ఉపయోగిస్తారు. ఫిన్స్‌తో తయారయ్యే దారం సర్జరీ సమయంలో వేసే కుట్లకు వినియోగిస్తారు. ఈ ఫిన్స్‌ను చైనా సహా పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

* పెలాజిక్ రొయ్యలు: సముద్రపు నీటి ఉపరితలంలో ఇవి ఉంటాయి. మార్కెట్‌లో వీటికి డిమాండ్ ఉంది. ఖరీదైన ఈ రొయ్యలు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. స్థానికంగానూ ఎక్కువగా కొంటారు.
ఏమేమి ఉన్నాయంటే...

గర్నార్డ్స్ రకం చేపలు
మ్యూజియంలో సొరలు, ఉలవలు, టేకులు, బోని వంటి 192 రకాలైన చేపలు, రొయ్యలు, పీతలు, ఆళ్ల రొయ్యలు వంటి 32 జాతులు, కలిమిందల రకాలకు చెందిన మూడు జాతులు, గవ్వలు రకానికి చెందిన ఒకటి చొప్పున కొలువుదీరాయి. సముద్రపు మొసలి, రంపపు చేపలు, సముద్రపు పాము నమూనాలున్నాయి. ● ఆస్ట్రేలియా సముద్ర జలాల్లో లభ్యమయ్యే నీటి గుర్రం చేప, గుర్రపునాడ పీత, అండమాన్ దీవుల్లో దొరికే మృదువైన ఎండ్రకాయ రకం చేప, నికోబర్ దీవుల్లో దొరికే సాలీడు పీతల నమూనాలను సైతం ఇక్కడ భద్రపరిచారు.
ఇదీ చదవండి: LIVE VIDEO : మూతికి నిప్పు.. అలరించబోయి విలపించాడు..!