నెల్లూరు జిల్లా బోగోలు మండలం బిట్రగుంట కొండపై కొలువైన శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి రథం శుక్రవారం తెల్లవారు జామున దగ్ధమైంది. ఆలయ ఆవరణలో నిలిపి ఉంచిన ప్రాచీన రథంలో అర్ధరాత్రి మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు వ్యాపించి రథం పూర్తిగా కాలిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు రథానికి నిప్పు పెట్టి ఉంటారని గ్రామస్థులు తెలిపారు. ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి రథోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో... ఈ ఘటన చోటు చేసుకోవడంపై భక్తులు విచారం వ్యక్తం చేశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, బిట్రగుంట ఎస్సై భరత్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
స్పందించిన మంత్రి వెల్లంపల్లి
ఈ ఘటనపై రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆకతాయిల చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తక్షణ చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణిని ఆదేశించారు. దేవాలయాల పరిరక్షణకు వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి : జాయింట్ కలెక్టర్‌ను...భూములు క్రమబద్ధీకరణ చేయిస్తా!