మాస్క్‌లు పెట్టుకోని 18,566 మంది నుంచి రూ.17,33,785 జరిమానా వసూలు చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, మాస్క్‌లు పెట్టుకోని వారి నుంచి జరిమానా వసూలు చేశామన్నారు. డ్రైవ్‌లో 4,394 మంది పోలీసులు పాల్గొన్నారని తెలిపారు. తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మాస్క్‌లు పెట్టుకోని వారిని ఎక్కువ సంఖ్యలో గుర్తించినట్లు వెల్లడించారు.
ప్రకాశం జిల్లాలో అత్యధికంగా రూ.2,10,110, అనంతపురంలో రూ. 1,94,885, విజయవాడలో రూ. 1,93,850, తూర్పుగోదావరిలో రూ. 1,78,050, విశాఖపట్నం సిటీలో రూ. 1,16,700 జరిమానా వసూలు చేశామని డీజీపీ తెలిపారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నందన ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.
రాంబిల్లి పోలీసులకు డీజీపీ సెల్యూట్
దుర్వాసన వస్తున్న గుర్తు తెలియని మృతదేహాన్ని 3కి. మీ మోసుకెళ్లిన విశాఖ జిల్లా రాంబిల్లి పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందనలు తెలిపారు. సేవా తత్పరతకు ఏపీ పోలీసులు ప్రతీక అని మరోసారి నిరూపించారని వ్యాఖ్యానించారు. రాంబిల్లి ఎస్సై, ఏఎస్సై దొర, హెచ్‌సీ మసేను, కానిస్టేబుల్ నర్శింగరావు, హోంగార్డు కొండబాబు సేవకు సెల్యూట్ చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు.
ఇదీ చదవండి: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం