గ్రామపంచాయతీ ఖాతాలనుంచి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వాడుకున్న రూ.7,660 కోట్ల ఆర్థిక సంఘం నిధులను తక్షణం వెనక్కి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. పంచాయతీ ఖాతాలకు నిధులు తిరిగి జమ చేసే వరకు పార్టీలకతీతంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని అన్నారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో 2రోజులపాటు నిర్వహించే పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఛాంబర్ ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా సర్పంచుల సంఘాలకు చెందిన నాయకులను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా సర్పంచులకు నిధులు, అధికారాలు కల్పించకపోగా.. కేంద్రం 2018-19 నుంచి 2021-22 మధ్య కేటాయించిన రూ.7,660 కోట్ల ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి సొంత అవసరాలకు వాడుకుంది. ఈ కారణంగా సర్పంచులు ఉత్సవ విగ్రహాలయ్యారు. గ్రామానికి సేవ చేద్దామని ఎన్నో ఆశలు, ఆశయాలతో గెలిచిన సర్పంచులు ప్రభుత్వ అసంబద్ధ చర్యలతో ఇబ్బంది పడుతున్నారు. తాగునీరు, రహదారులు, కాలువలు, వీధిదీపాలను కూడా సమకూర్చలేని స్థితిలో ఉన్నారు. గ్రామపంచాయతీ సమ్మతి లేకుండా ఆర్థిక సంఘం నిధులను మళ్లించే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఇదేనా పంచాయతీ వ్యవస్థకు ఇస్తున్న గౌరవం? స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. పంచాయతీ నిధులు మళ్లించినందున పూర్తయిన పనులకు బిల్లులు రాక అనేక మంది సర్పంచులు అప్పులపాలై వడ్డీలు చెల్లించలేక మనోవ్యథకు గురవుతున్నారు. నిధులు మళ్లించిన ప్రభుత్వంపై సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం డీజీపీని కలిసి విన్నవిస్తాం’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు.
వాలంటీర్లకంటే సర్పంచులకు తక్కువ వేతనం
‘గ్రామాల్లో వాలంటీర్లకు నెలకిస్తున్న వేతనంకంటే సర్పంచుల గౌరవ వేతనం తక్కువ. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? వాలంటీర్ నెల గౌరవ వేతనం రూ.5 వేలుంటే.. సర్పంచికి ఇస్తున్నది రూ.3 వేలే. సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి గ్రామపంచాయతీలను దెబ్బతీసింది. సర్పంచి, ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాలి. ఎంపీపీ, జడ్పీటీసీలకు రూ.30 వేలు, మున్సిపల్ కౌన్సిలర్లకు రూ.20 వేలు, కార్పొరేటర్లకు రూ.30 వేల గౌరవ వేతనం ఇవ్వాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీలనుంచి రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన నిధులను వెనక్కి ఇచ్చేవరకు చేస్తున్న పోరాటాలకు సర్పంచులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ స్థానిక సంస్థలను పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, దీన్ని రాజకీయాలకు అతీతంగా అడ్డుకోవాలని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కాసరనేని మురళి, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడు వై.వినోద్‌రాజు, కార్యనిర్వాహక కార్యదర్శి వాసం మునయ్య, రాష్ట్ర జడ్పీటీసీల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎ.రామకృష్ణనాయుడు, ఎస్.సుబ్బరామయ్య అన్నారు.
భవిష్యత్ కార్యాచరణపై నేడు ప్రకటన
ఆర్థిక సంఘం నిధులు తిరిగి గ్రామపంచాయతీ ఖాతాల్లో వేసేలా ఉద్యమాన్ని తీవ్రం చేయడంపై కార్యాచరణను మంగళవారం ప్రకటిస్తామని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ విలేకరులకు తెలిపారు. తమ డిమాండ్లపైనా సమావేశంలో చర్చించి తీర్మానాలు చేస్తామన్నారు.
అనాగరికమిది
- శ్రీరామమూర్తి,ప్రకాశం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు
‘సర్పంచులతో సంబంధం లేకుండా గ్రామపంచాయతీ నిధులను ప్రభుత్వం తీసుకోవడం అనాగరికం. ఇది సర్పంచుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. నేను అధికార పార్టీకి చెందిన వ్యక్తినైనా ఈ చర్యలను వ్యతిరేకిస్తున్నా. వీధుల్లో పాడైన బల్బుల స్థానంలో కొత్తవి వేసే పరిస్థితి కూడా చిన్న పంచాయతీల్లో లేదు. దీన్ని ప్రశ్నించకపోతే అన్యాయమే రాజ్యమేలుతుంది’.
ఎమ్మెల్యేలను నిలదీద్దాం
- చెల్లుబోయిన ఎలీనా, సర్పంచి, కోనసీమ జిల్లా
‘ఆర్థిక సంఘం నిధుల కోసం ఎమ్మెల్యేలను రోడ్లపై నిలదీద్దాం. అప్పుడుగానీ ప్రభుత్వం దిగిరాదు. ప్రజలు సమస్యలపై నిలదీస్తున్నప్పుడు.. సర్పంచులకు ప్రభుత్వం చేసిన అన్యాయంపై ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే తప్పేముంది? దీనిపై పార్టీలకతీతంగా ఉద్యమిద్దాం’.
గౌరవ వేతనం తీసుకోలేని పరిస్థితి
- ఆర్.స్వామినాయుడు, సర్పంచి, విజయనగరం జిల్లా
‘ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో గౌరవ వేతనం తీసుకోలేని స్థితిలో ఉన్నాం. ఉన్న కొద్దిపాటి నిధులు విద్యుత్తు ఛార్జీలకే సరిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సర్పంచులున్నా, లేకున్నా ఒకటే. పంచాయతీలను పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తున్నారు. వాలంటీర్లకిచ్చే గౌరవ వేతనం కూడా సర్పంచులకు లేకపోవడం అన్యాయం’.
హక్కులను వదులుకోవద్దు
-బి.జనార్దన్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, అన్నమయ్య జిల్లా
‘పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని అధికార వైకాపా సర్పంచులు భయపడుతున్నట్టున్నారు. హక్కులను ప్రభుత్వం హరిస్తున్నప్పుడు చేతులు కట్టుకొని కూర్చుంటే ఎలా? సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నామో ప్రజలకు సమాధానం చెప్పాలి. పార్టీలకతీతంగా ప్రభుత్వంపై పోరాడాలి.’
గడపగడపలో కరపత్రాలు అంటిద్దాం
-కె.శ్రీనివాసులయాదవ్, సర్పంచి, నంద్యాల జిల్లా
‘ప్రభుత్వం నిధులు మళ్లించినందున గ్రామాల్లో పనులు చేయలేకపోతున్నామని గడపగడపలో కరపత్రాలు అంటిద్దాం. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలి.’
మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
-ఎం.విజేత, మండల మాజీ అధ్యక్షురాలు, గుంటూరు జిల్లా
‘చంద్రబాబు హయాంలో నిధులు, విధుల సాధనకు ఎలా ఉద్యమించామో.. అదే విధంగా ఆర్థిక సంఘం నిధులను రాబట్టేందుకు మరో పోరాటం చేయాలి. నిధులను మళ్లించడం దుర్మార్గం.