Amaravati Farmers Maha Padayatra: పల్లె, పట్టణం తేడా లేదు. ఊరూ వాడా భేదం లేదు. రాజధాని రైతుల మహా పాదయాత్ర మార్గమంతా అదే స్పందన.. అదే ఉత్సాహం. అమరావతి రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రజలు నిలవాలన్న అభిలాషను వ్యక్తం చేస్తూ.. అన్ని వర్గాల ప్రజలు రాజధాని రైతు దండు వెంట కదులుతున్నారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని ముక్తకంఠంతో నినదించారు.
రాజధాని రైతుల మహా పాదయాత్ర ఐదో రోజున బాపట్ల జిల్లా కొల్లూరు నుంచి ఉత్సాహంగా ప్రారంభమైంది. రైతులతో పాటు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. కొల్లూరులో రైతులు బస చేసిన కల్యాణ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర మొదలుపెట్టారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మూడు రాజధానుల అంశాన్ని మరోసారి ప్రస్తావించడంపై రైతులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ ఐకాస నేత పువ్వాడ సుధాకర్ నల్ల చొక్కా ధరించి యాత్రలో పాల్గొన్నారు. సీఎం వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా, ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేలా ఉన్నాయని సుధాకర్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి తెలియని వారు పాలకులుగా ఉండటం ప్రజల దురదృష్టమన్నారు. ప్రభుత్వం వద్ద రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు ఉన్నాయా అని మరో ఐకాస నేత గద్దె తిరుపతిరావు, ఇతర రైతులు ప్రశ్నించారు.
అనంతవరం గ్రామానికి చెందిన 85 ఏళ్ల నారాయణరావు అనే రైతు రాజధానికి నాలుగు ఎకరాల భూమి ఇచ్చారు. ఈ వయసులో కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితిని ముఖ్యమంత్రి కల్పించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తుంటే.. ఆ వర్గాలకు చెందిన మంత్రులు సీఎంను పొగడటమేంటని మరికొందరు రైతులు ప్రశ్నించారు.
ముంబయి, విశాఖ నుంచి వచ్చిన అనేక మంది యాత్రలో రైతులతో కలిసి నడిచారు. కొల్లూరు మండల రైతులు రూ.13 లక్షల విరాళాన్ని ఐకాస నేతలకు అందించారు. కొల్లూరు నుంచి వచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు తాను సైతం అంటూ పాదయాత్రలో పాల్గొన్నారు. అమరావతిలో రాజధాని నిర్మిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని.. 3 రాజధానులతో నష్టమేనని అన్నారు.
రైతుల పాదయాత్ర కొల్లూరు, కోటిపల్లి, వెల్లటూరు, భట్టిప్రోలు మీదుగా పాదయాత్ర ఐలవరం చేరుకుంది. శనివారం తిరిగి అక్కడి నుంచే యాత్ర ప్రారంభం కానుంది.
ఇవీ చదవండి: