Fear of monkeys in Nizamabad district: తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడద ప్రాణాంతకంగా మారుతోంది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లిలో ఇటీవల చెరువు కట్టపై ఐదుగురు చిన్నారులు నడుచుకుంటూ వెళ్తుండగా.. వీరిపైకి కోతుల గుంపు దూసుకొచ్చింది. దీంతో భయపడిన వారు ఎటు వెళ్లాలో తెలియక చెరువులో దూకారు. ఏంచేయాలో తోచని చిన్నారులు పక్కనే ఉన్న చెరువులో దూకారు. అందులో ముగ్గురు సురక్షితంగా బయటపడగా ఇద్దరు మృతి చెందారు.
జిల్లాలో కోతులు భయానక పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఇంట్లో దాబాకిపైకి వెళ్లాలంటే తోడుగా ఓ మనిషి, కర్ర తప్పనిసరిగా కావాల్సిందే. ఒంటరిగా బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలపై దాడులకు పాల్పడుతున్నాయి. బయటకు వచ్చినప్పుడు కోతులు వెంబడించడంతో ప్రమాదాల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. పెంకుటిళ్లను ధ్వంసం చేస్తుండటంతో ఏటా మరమ్మతులకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని మాక్లూర్ మండలం మామిడిపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాన్ని కోతులు బెడద నుంచి కాపాడాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
మామిడిపల్లి పక్కనే అడవి ఉండటంతో ఎక్కడెక్కడో పుట్టిన వానరాలను ఇక్కడే వదిలేసి వెళ్తున్నారు. కోతులు సమీప గ్రామాల్లో వీరంగం సృష్టిస్తున్నాయి. పాఠశాల సమయాల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనం కూడా తినలేని పరిస్థితి ఎదురవుతోంది. కిరాణా దుకాణానికి వెళ్లినా... ఆడుకోవాలని చూసినా కోతులతో ఇబ్బంది ఎదురవుతోందని పిల్లలు చెబుతున్నారు. మర్కటాల బారిన పడుకుండా పిల్లలను ఓ కంట కనిపెట్టాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోతుల మూలంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు తక్షణమే స్పందించి... పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. పిల్లలను బయటకు పంపించడానికి భయపడుతున్నామని గ్రామస్థులు వాపోయారు. ఇటీవల ఇద్దరు పిల్లలు ఈ కోతుల మూలంగా మరణించడం అందరూ భయాందోళనలో ఉన్నారని గ్రామ ప్రజలు తెలిపారు.
ఇవీ చదవండి: