తండ్రే కన్న కూమార్తెల గొంతు కోసిన దారుణ ఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన మహమ్మద్... 15 ఏళ్లుగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతెలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గ్రామంలో కటిక వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
గత కొంత కాలంగా మహమ్మద్ సైకోలా ప్రవర్తించేవాడు. తరచూ కలహాలు సృష్టిస్తూ... కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడే వాడు. ఈ ప్రవర్తన చూసి గ్రామస్థులంతా కలిసి మహమ్మద్ కుటుంబాన్ని మోతె నుంచి వెళ్లగొట్టారు. అప్పటినుంచి మహమ్మద్ కుటుంబం దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో నివాసం ఉంటున్నారు.
ఈరోజు ఉదయం నుంచి ఇంటి తలుపులు మూసి ఉండటం... ఇంట్లో నుంచి అరుపులు వినిపించటాన్ని గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. మహమ్మద్ అప్పటికే ఇద్దరు కూమార్తెల గొంతు కోశాడు. .
గమనించిన పోలీసులు అంజరిన(8), అలిన (6)ను మహమ్మద్ నుంచి కాపాడారు. చిన్నారులను కాపాడే క్రమంలో కానిస్టేబుల్ రాజుపై కత్తితో మహమ్మద్ దాడి చేశాడు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్ చేతికి కత్తిగాట్లు పడ్డాయి. కానిస్టేబుల్ రాజును, పిల్లలు ఇద్దరినీ... సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే స్పందించగా... పిల్లలకు ప్రాణాపాయం తప్పింది. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చూడండి:
'శ్రీదేవి అక్కా.. పేకాట గురించి మాట్లాడలేదని ప్రమాణం చేస్తారా?'