తెలంగాణలోని శంషాబాద్ వద్ద హత్యాచారానికి గురైన 'దిశ' కేసులో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. త్వరలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైన తర్వాత రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకోనున్నారు.
దిశ హత్యాచారం కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కేసు సత్వర విచారణకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇటీవల వరంగల్‌లో ఓ బాలిక హత్య ఘటనపై ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడంతో.. 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడింది. అదే తరహాలో ఈ కేసులోనూ సత్వర తీర్పు రావాల్సిన అవసరముందని భావించిన ప్రభుత్వం.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుపై హైకోర్టుకు ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనకు ఉన్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది.