రాజధాని అమరావతిపై సీఎం జగన్ నోరు విప్పాలని రైతులు కోరారు. లేదంటే పోరుబాట పడతామని హెచ్చరించారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఇవాళ తుళ్లూరులో సమావేశమయ్యారు. నిర్మాణ పనులు ఆగిపోవడం, అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందనే నమ్మకంతో, తమ భవిష్యత్తు కూడా బాగుంటుందని భూములు ఇచ్చామని వారు అన్నారు. ఇప్పుడు అమరావతిలో నిర్మాణ పనులన్నీ ఆగిపోయిన కారణంగా.. ఏం చేయాలనే దానిపై సంఘటితంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. వివిధ రాజకీయ పక్షాల నేతలను కలిసినట్లుగానే ముఖ్యమంత్రిని కూడా కలిసి సమస్యలు చెప్పుకోవాలని తీర్మానించారు. అప్పటి ప్రభుత్వంతో చట్టపరంగా చేసుకున్న ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని రైతులు ప్రకటించారు.
సంబంధిత కథనాలు