పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని గ్రామాల్లో 270వ రోజు రైతులు ఆందోళనను కొనసాగించారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని మహిళలు, రైతులు దీక్షా శిబిరాలు నిర్వహించారు. ఎర్రబాలెం, పెనుమాక, కృష్ణాయపాలెం, మందడం, తుళ్లూరు, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, రాయపూడి, అబ్బరాజుపాలెం, అనంతవరం, పెదపరిమి గ్రామాల్లో రైతులు దీక్షలు చేశారు.
పాలాభిషేకం..
ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజధాని ఎజెండాగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా అని ప్రశ్నించిన నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘరామరాజుకు రైతులు సంఘీభావం ప్రకటించారు. ఉద్ధండరాయునిపాలెంలో రఘరామరాజు చిత్ర పటానికి రైతులు పాలాభిషేకం చేశారు. రాజధానికి సంబంధం లేని వ్యక్తి తన పదవిని తృణప్రాయంగా వదులుకునేందుకు సిద్ధపడితే ఇదే ఊరి నుంచి ఎంపీగా ఎన్నికైన ఓ ప్రజాప్రతినిధి మాత్రం మూడు రాజధానులకు మద్దతు పలకడాన్ని రైతులు తప్పుపట్టారు.
తుళ్లూరులో మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దీక్షా శిబిరం వద్ద గాలిపటాలను ఎగురవేసి నిరసన తెలియజేశారు. అమరావతి ఉద్యమం పతాక స్థాయికి చేరిందనే దానికి గుర్తుగా గాలిపటాలు ఎగురవేశామని మహిళలు చెప్పారు. అమరావతిని సాధించేందాకా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కేంద్రం అఫిడవిట్ లు వేయడాన్ని రైతులు తప్పుపట్టారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం విభజిస్తేనే రాష్ట్రం విడిపోయిందని... ఇప్పుడు రాజధాని విషయంలో ఇలా ప్రవర్తిండం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసుల పహారా లేకుండా రాజధానిలో జరుగుతున్న ఉద్యమాన్ని పరిశీలంచాలని వైకాపా ప్రజాప్రతినిధులకు రైతులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: