రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ప్రణాళిక అస్తవ్యస్తంగా మారింది. ఓ వైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు అల్లాడుతున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవటంతో విద్యుత్‌కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. గృహ విద్యుత్ సరఫరాలో కోతలు నామమాత్రంగా ఉన్నా.. వ్యవసాయ విద్యుత్ విషయంలో మాత్రం భారీగా కోత పెడుతున్నారు. నీరు లేక పంటలు నిలువునా ఎండిపోతున్నాయి.
గతేడాది పుష్కలంగా వర్షాలు కురిసి బోర్లలో ఊటలుండటంతో అనంతపురం జిల్లా శింగనమల, తాడిపత్రి, రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో రైతులు ఉద్యాన పంటలు విస్తారంగా సాగు చేశారు. ప్రస్తుతం విద్యుత్ కోతలు విధించటంతో బోర్లలో నీరున్నా పంటలు ఎండిపోయే దుస్థితి. ఎండ తీవ్రత నుంచి మొక్కలను కాపాడటానికి నీడను ఏర్పాటు చేస్తున్నప్పటికీ..నీరు అందక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవటంతో కరెంట్ కోసం బోర్ల దగ్గర రైతులు ఎదురుచూడాల్సి వస్తోంది.
విద్యుత్ కోతలు... ఆక్వా సాగుపైనా పెను ప్రభావమే చూపుతున్నాయి. ప్రకాశం జిల్లా తీర ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ఇంతవరకూ ధరలో హెచ్చు తగ్గులు, మేత ధర పెరగడం వంటి కారణాలతో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కర్షకులు... తాజాగా విద్యుత్తు కోతలతో సతమతమవుతున్నారు. విద్యుత్ సరఫరా లేక ఏరియేటర్లు ఆడించలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్తు కోతల వల్ల డీజిల్ ఇంజన్ల వినియోగం పెరిగింది. దీనికితోడు డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. నీరు అందక పత్తి పంటలు సైతం ఎండిపోతున్నాయి. నెల్లూరు జిల్లా రావులకొల్లులో వందల ఎకరాల్లో పత్తి ఎండిపోయింది. ప్రభుత్వం స్పందించి విద్యుత్ కోతలు నియంత్రించి పంటలను బతికించాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. తెదేపా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు