విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అంటూ ప్రచారం చేస్తున్న రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్వహణకు అద్దె చెల్లింపు కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో లేక చాలాచోట్ల ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుని వాటిని నిర్వహిస్తున్నారు. ఈ భవనాలకు రంగులు వేయడంపై చూపిన శ్రద్ధ.. అద్దె చెల్లింపులో మాత్రం కనిపించలేదు. 13నెలలనుంచి రూ.23 కోట్ల అద్దె బకాయిలు పేరుకుపోయాయి.
అద్దె భవనాలకు తాళాలు
భవనాల యజమానులు అద్దె కోసం స్థానిక వ్యవసాయ సహాయకులను ప్రశ్నిస్తున్నారు. స్పష్టమైన హామీ లభించక వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో శుక్రవారం పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురం, వట్టిచెరుకూరుల్లో ఆర్‌బీకేలకు తాళాలు వేశారు. చాలాచోట్ల అద్దె చెల్లించాలని నిలదీస్తుండటంతో సిబ్బంది సమీపంలోని సచివాలయ భవనాలకు వెళ్లి కూర్చుంటున్నారు. కేంద్రాల విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో కనెక్షన్ తొలగిస్తున్న దాఖలాలూ ఉన్నాయి.
5వేలకుపైగా అద్దె భవనాల్లోనే..
రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు, 65చోట్ల హబ్‌లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. గ్రామాలు, పట్టణాల్లో ఖాళీగా ఉన్న ప్రాథమిక సహకార సంఘాలు, సామాజిక భవనాల్లో వీటిని ఏర్పాటుచేశారు. ఇవికాకుండా 4వేల కేంద్రాల కోసం ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్‌బీకేల ఏర్పాటుపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో 1500 కేంద్రాలవరకు ప్రైవేటు భవనాల్లోకి మార్చారు. మొత్తంగా 5,500 వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి గతేడాదినుంచి చెల్లింపులు నిలిచాయి. ఒక్కో భవనానికి నెలకు రూ.4వేలకుపైనే చెల్లించాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం చివరలో ఆంక్షల కారణంగా చెల్లింపులు నిలిచాయి. గతేడాది బడ్జెట్‌లో రూ.18 కోట్లు కేటాయించినా..రూ.13.27 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.18 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. అయితే గతేడాది చెల్లించాల్సిన బకాయిలే రూ.23కోట్ల వరకు ఉండటం గమనార్హం.
త్వరలోనే చెల్లింపులు
రైతు భరోసా కేంద్రాలు, హబ్‌ల అద్దె బకాయిల అంశాన్ని సిబ్బంది తమ దృష్టికి తెచ్చారని వ్యవసాయశాఖ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. మార్చి 31న నిధులు విడుదలైనా బడ్జెట్ ఇబ్బంది కారణంగా చెల్లింపు నిలిచిందని, త్వరలోనే ఇస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది: కళా వెంకట్రావు