కరోనా నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహారాన్ని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా సేంద్రియ(ఆర్గానిక్) ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అటు ఆరోగ్య నిపుణులు సేంద్రియ ఉత్పత్తుల వాడకం పెంచమని సూచించడంతో ప్రజలు వాటిపై దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం భాగ్య నగరంలో ఆర్గానిక్ ఫుడ్ హవా నడుస్తోంది. నగరవాసుల్లో ‘ఫార్మ్ టు టేబుల్’ అంశానికి ఆదరణ పెరుగుతోంది. సేంద్రియ ఆహారాన్ని అందించేందుకు నగరంలోని రెస్టారెంట్లు పోటీ పడుతున్నాయి.
ప్రత్యేక రెస్టారెంట్లు.. జూబ్లీహిల్స్, సుచిత్ర, మాదాపూర్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఎక్పోటిక్ పండ్లు, కూరగాయల సూపర్‌మార్కెట్లతో పాటు రెస్టారెంట్లు ఫార్మ్ టు టేబుల్ కాన్సెప్ట్‌తో ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. జూబ్లీహిల్స్, కూకట్‌పల్లిలోని బాంబైరీ తమ ఔట్‌లెట్లను ప్రారంభించింది. సేంద్రియ పంటలను సాగు చేసే రైతులతో నగరంలోని స్టార్ హోటళ్లు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
సేంద్రియ రైతులతో...
మేడ్చల్, తాండూరు తదితర శివారు ప్రాంతాల రైతులు సేంద్రియ పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. చేవెళ్లలో ప్రత్యేకంగా నోపాలస్, కాక్టీస్ వంటి ఉత్పత్తులను పండిస్తున్నారు. మేడ్చల్ తుప్రాన్, శామీర్‌పేట్, మహేశ్వరం ప్రాంతాల్లో ఆర్గానిక్ టమోటా మొదలు అన్ని రకాల కూరగాయలను గ్రీన్‌హౌస్‌ల్లో పెంచుతున్నారు. ఆర్గానిక్ పంటలకు కాస్త ధర కూడా ఎక్కువగానే పలుకుతోంది. తాండూరు నుంచి ప్రత్యేకంగా సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లను కొనుగోలు చేస్తున్నారు. నగరంలోని పలు సూపర్‌మార్కెట్ల వారు రైతులతో నేరుగా ఒప్పందం చేసుకుని ఈ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: