తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిని అని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం రేకులపల్లికి చెందిన బార్ల లక్ష్మీనారాయణ.. ఉద్యోగాలిప్పిస్తానని పలువురి వద్ద డబ్బులు వసూలు చేశాడు. త్వరలోనే కలెక్టర్ కాబోతున్నానంటూ పట్టణంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. మెుత్తం 40మంది నుంచి సుమారు కోటి రూపాయలు వసూలు చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు బండారం బయటపడింది. తనకు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సంబంధాలున్నాయని.. అందర్నీ నమ్మించాడు. పోలీసుల తనిఖీల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల సర్వీస్ పుస్తకాలు, పలువురి ధ్రువపత్రాలు, రూ.2 లక్షల నగదు, 2 విలువైన కార్లు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: తిరుపతి ఉపఎన్నికపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం: నాదెండ్ల మనోహర్