NRIs on high court Verdict : అమరావతి విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ప్రవాసాంధ్రులు సంబరాలు చేసుకున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైకోర్టు తీర్పు చెప్పడం హర్షణీయమన్నారు. తెదేపా సీనియర్ నేత, గుంటూరు మిర్చియార్టు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, ప్రవాసాంధ్రులు మాగులూరి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, సీఆర్డీఏ చట్టాన్ని మార్చేందుకు వీల్లేదనే హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి మూడు రాజధానుల ఆలోచనను మానుకుని ప్రజారాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రవాసాంధ్రులు సూచించారు. భవిష్యత్తులో ఇష్టానుసారంగా జగన్ రెడ్డి చట్టాలు చేయకుండా హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని.. ఈ తీర్పు చరిత్రాత్మకమన్నారు.
రాజధానిని మార్చేందుకు ప్రయత్నించిన జగన్ రెడ్డి.. ప్రజాక్షేత్రంలోనూ, న్యాయస్థానంలోనూ ఓడిపాయారన్నారు. రైతుల పోరాటంలో న్యాయం ఉంది కాబట్టే న్యాయస్థానంలో రైతులకు నిజమైన న్యాయం దొరికింది -మాగులూరి భాను ప్రకాష్
అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, వైకాపా ప్రభుత్వం మొండి వైఖరితో తెలుగుజాతిని నవ్వుల పాలు చేసింది. హైకోర్టు తీర్పుపై అనవసరపు పట్టుదలకు పోకుండా రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలి - డాక్టర్ లికిత్
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక భూమిని ల్యాండ్ పూలింగ్‌కు అమరావతి రైతులు ఇచ్చారు. 800 రోజులకు పైగా ధర్నా చేస్తున్న రాష్ట్ర ప్రజలకు.. హైకోర్టు తీర్పు శుభవార్త లాంటిది - అంకిత ఉప్పలపాటి
ఇదీ చదవండి : రాజధాని అమరావతే... మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు: హైకోర్టు