8 జిల్లాల్లోని లంబాడి, సుగాలి, యానాది, చెంచు వర్గాలకు చెందిన ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేసేలా ఆదేశాలివ్వాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను ఆదివాసీ ప్రతినిధులు కోరారు. మాజీ ఎంపీ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివాసి సంఘాల నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. సమస్యలను వివరించారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ద్వారా ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలికి అనుగుణంగా గిరిజనులను ఆదుకోవాలని కోరినట్లు రవీందర్ నాయక్ తెలిపారు. మైదాన ప్రాంతాల్లోని 60 శాతం ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని, వీరందరికీ సమగ్ర ఐటీడీఏ ఏర్పాటుచేసి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించాలని కోరామన్నారు. రాష్ట్రంలో 150 నుంచి 500 మంది జనాభా కల్గిన సుగాలి తాండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, ఎస్టీ కులాల వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు.
ఎస్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గిరిజన కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. కర్నూలులో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సుగాలి ప్రీతి అనే విద్యార్థిని దారుణంగా హత్య చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరామన్నారు.
ఇదీ చదవండి: