మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అచ్చెన్న తరఫున సీనియర్ న్యాయవాది సిద్థార్థ లూధ్రా వాదనలు వినిపించారు. కేసులో ఏ3 ని అరెస్ట్ చేయలేదనే కారణంతో బెయిల్ పిటిషన్ తిరస్కరించడం సరికాదని వాదించారు. మొత్తం స్కాంలో మూడు కోట్ల మేర అక్రమాలు జరిగాయని అనిశా ఆరోపిస్తోందని అన్నారు. లేబర్ మినిస్టర్ గా పిటిషనర్ టెలీహెల్త్ సర్వీసెస్ కు కేవలం 30 లక్షలు మాత్రమే చెల్లించారని కోర్టు ముందు ఉంచారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతి తీసుకోవాలని.. కానీ అనిశా అధికారులు ఆ నిబంధన పాటించలేదని ఆరోపించారు.
మరో వైపు.. అనిశా తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. స్కాంలో అచ్చెన్నాయుడికి నేరుగా ప్రమేయం ఉందని.. టెలీ సర్వీసెస్ కు కాంట్రాక్ట్ ఇవ్వాలని లేఖలు రాసిన విషయాన్ని కోర్టు ముందు ఉంచారు. ఏపీ ఫైనాన్స్ కోడ్ మేరకు లక్ష రూపాయలు పైబడి కాంట్రాక్ట్ కు టెండర్ పద్ధతి పాటించాల్సి ఉన్నా.. ఎలాంటి టెండర్ లేకుండా నామినేషన్ పద్దతిలో టెలీ సర్వీసెస్ కు కాంట్రాక్ట్ అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. మాజీ మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడినందున అరెస్ట్, విచారణకు ముందస్తు అనుమతి అవసరం లేదని ఏజీ వాదించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
కొవిడ్ చికిత్సల పర్యవేక్షణ బాధ్యతలు.. సీనియర్ ఐఏఎస్లకు అప్పగింత