రుణ యాప్‌ల పేరిట దారుణాలకు పాల్పడిన చైనీయుల బాగోతం ఈడీ దర్యాప్తులో బయటపడుతోంది. మన దేశానికి చెందిన ఫైనాన్స్ కంపెనీలను చేజిక్కించుకొని.. రుణాల పేరిట వేధింపులకు గురి చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో తేలింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా ఆర్బీఐ నుంచి 2002లో అనుమతి పొందిన పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను 2018లో చైనా జాతీయుడు జో యాహుయ్ బినామీ సంస్థల ద్వారా చేజిక్కించుకున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.
పూర్తిగా చైనీయుల అధీనంలో ఉన్న పీసీఎఫ్ఎస్.. క్యాష్ బిన్ యాప్ ద్వారా అధిక రుణాలు ఇచ్చింది. రుణాల ద్వారా అందిన సొమ్మును దొడ్డి దారిన విదేశాలకు తరలించినట్లు ఈడీ పేర్కొంది. రుణాల ద్వారా ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును బోగస్ సాఫ్ట్ వేర్ ఎగుమతుల పేరుతో దేశం దాటించినట్లు తేలింది. చైనా, హాంకాంగ్, తైవాన్, అమెరికా, సింగపూర్‌కు పీసీఎఫ్ఎస్ సొమ్ము మళ్లించిందని ఈడీ తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పీసీఎఫ్ఎస్ బ్యాంకు ఖాతాల్లోని 106 కోట్ల 93 లక్షల రూపాయలను ఈడీ జప్తు చేసింది. చైనా జాతీయుల అధీనంలో ఉన్న ఎన్బీఎఫ్సీలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి: