ED Raids in hyderabad: చైనా బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంలో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్.. ‘వజీర్‌ఎక్స్ (జాన్మై ల్యాబ్స్ ప్రై.లిమిటెడ్)’కు చెందిన హైదరాబాద్‌లోని నిర్వాహకుల ఇళ్లలో రెండు రోజులుగా సోదాలు నిర్వహించి రూ.వంద కోట్లు జప్తు చేసినట్లు ఈడీ గురువారం తెలిపింది. చైనా బెట్టింగ్ యాప్‌ల దందాలో భాగంగా రూపాయల్లో ఉన్న సొమ్మును క్రిప్టో కరెన్సీగా మార్చి కేమన్ దీవుల్లో రిజిస్టర్ అయిన ‘బైనాన్స్ వాలెట్ల’లోకి పంపించినట్లు ఈడీ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. ఈ వ్యవహారంలో ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వజీర్‌ఎక్స్ కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తోంది.
ఈ ఎక్స్ఛేంజ్ ద్వారా సుమారు రూ.2,790.74 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు గతంలోనే గుర్తించింది. ఇందులో నమోదైన ఖాతాల్లోకి విదేశాల్లోని బైనాన్స్ ఖాతాల నుంచి రూ.880 కోట్లు వచ్చాయని.. భారత్ నుంచి విదేశాల్లోని బైనాన్స్ ఖాతాల్లోకి రూ.1400 కోట్లు వెళ్లాయని ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది. ఆడిట్ లేదా దర్యాప్తు చేసేందుకు ఈ ఆర్థిక లావాదేవీలు బ్లాక్‌చెయిన్‌లో అందుబాటులో లేవని వెల్లడైంది. దీన్నిబట్టి ఎక్స్ఛేంజ్ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి భారత్ నుంచి విదేశాలకు ఆర్థిక లావాదేవీలు సాగించారని అనుమానిస్తున్నారు. ఆ వివరాలు తెలపాలంటూ గతేడు షోకాజ్ నోటీసులు పంపించారు. తాజా సోదాల్లో ఈ బెట్టింగ్ యాప్‌లలో చైనా రుణ యాప్‌లు పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ గుర్తించింది.
ఇవీ చూడండి..