వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు (పీఏసీఎస్) 2022 జనవరిలోగా ఎన్నికలు పూర్తిచేసి.. కొత్త పాలకవర్గాలు కొలువుదీరేలా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. డిసెంబరు చివర్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. రెండుదశల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు.
2018 నుంచి సాగతీతలే: 2013 జనవరి, ఫిబ్రవరిలో పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించారు. వీరి పదవీకాలం 2018లో ముగిసింది. తర్వాత ఆరు నెలల చొప్పున పదవీకాలం పొడిగిస్తూ వచ్చారు. 2019 జులైలో పర్సన్ ఇన్‌ఛార్జి కమిటీలను నియమించారు. వీరికీ ఆరు నెలలకోసారి పొడిగింపు ఇచ్చారు. ఇంతలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. దీంతో పీఏసీఎస్‌లకు అధికారిక పర్సన్ ఇన్‌ఛార్జిలు, డీసీసీబీలకు జిల్లా సంయుక్త కలెక్టర్లను ఆరు నెలల కాలానికి నియమించారు. వీరినే మరింతకాలం పొడిగించి.. వారి ఆధ్వర్యంలోనే ఎన్నికలు నిర్వహించాలని భావించారు. ఇతర పనులతో వీరు పీఏసీఎస్ కార్యకలాపాలపై దృష్టి సారించలేకపోతున్నారని.. రైతులకు రుణాల మంజూరులో జాప్యం జరుగుతోందని వైకాపా నేతలు మంత్రులు, ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. పర్సన్ ఇన్‌ఛార్జి కమిటీల పదవీకాలం వచ్చే జనవరితో ముగియనుంది.
ఎన్నికలకు సిద్ధంగా: సహకార ఎన్నికల ప్రక్రియ ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తయింది. మొత్తం 2051 పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఇందులో సభ్యుల వివరాలు, ఓటర్ల జాబితాల రూపకల్పన దాదాపుగా కొలిక్కి వచ్చింది. కొవిడ్ నేపథ్యంలో.. ఎంతమంది సభ్యులు టీకాలు తీసుకున్నారనే సమాచారాన్ని అందించాలని సహకార సంఘాలకు ఆదేశాలు అందాయి. పూర్తి వివరాలు లేకపోవడంతో.. తమకు తెలిసిన మేరకు లెక్కలు వేసి పంపారు. జనవరిలో కొత్త పాలకవర్గాలు రావాలంటే, 45రోజుల ముందే ప్రక్రియ ప్రారంభించాలి. రెండుదశల్లో జరిగే ఎన్నికలకు.. ముందుగా అధికారుల నియామకం, సహకార సంఘాల దస్త్రాలు, ఓటరు జాబితాల సమర్పణ, ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ.. నుంచి ఓటరు జాబితాల పరిశీలనకే 18 రోజులు అవసరమవుతుంది. ఈ దిశగానే అధికారులు ప్రణాళికలు రూపొందించి త్వరలో జరిగే సమావేశంలో మంత్రుల ముందు ఉంచనున్నారు.
ఇదీ చదవండి: