రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కోస్తాలో వడగాల్పుల ప్రభావమూ అధికమైంది. బుధవారం అత్యధికంగా రాజమహేంద్రవరంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అమరావతి, నందిగామ, బాపట్లలో గరిష్ఠంగా 42 డిగ్రీలుపైగా, విశాఖపట్నంలో 42.2 డిగ్రీలుగా రికార్డు అయింది. కళింగపట్నంలోనూ సాధారణం కంటే 5.5 డిగ్రీలు పెరిగింది. జంగమహేశ్వరపురం, విజయవాడ, మచిలీపట్నంలో 41 డిగ్రీలు పైగా.. కాకినాడ, కావలి ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. యాస్ తుపాను ప్రభావంతో వాతావరణంలో తేమ తగ్గడం, ఉత్తరం నుంచి పొడిగాలులు వీస్తుండటంతో.. ఉష్ణోగ్రతలు పెరిగాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.
18 మండలాల్లో వడగాల్పులు
వాతావరణంలో తేమ తగ్గిపోవడంతో.. వడగాల్పుల ప్రభావం పెరిగింది. విశాఖపట్నం జిల్లాలో 15, తూర్పుగోదావరి జిల్లాలో మూడు మండలాల్లో వడగాల్పులు వీచాయి. గురు, శుక్రవారాల్లో కూడా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, విజయనగరం జిల్లాల్లోని అత్యధిక మండలాలో ఈ ప్రభావం ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఎండల ప్రభావం నెలాఖరు వరకు ఉంటుందని వాతావరణశాఖ తెలియజేసిందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు నమోదు కావచ్చని సూచించారు.
ఇవీ చూడండి: