ట్రిపుల్ ఐటీలలో నాణ్యమైన విద్యా బోధన కోసం ఫాకల్టీలను నియమించుకోవటంలో అలసత్వంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీల్లో భోధన, వసతులు విషయంలో రాజీ పడితే సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. సచివాలయంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. తక్షణమే అవసరమైన మేరకు అనుభవం కలిగిన అధ్యాపకులను నియమించుకునేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని మంత్రి సురేష్ సూచించారు. క్యాంపస్లలో విద్యార్థులకు అందించే భోజనం విషయంలో శ్రద్ద చూపాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భోజనం తనిఖీ కమిటీలు విధిగా పర్యవేక్షించాలన్నారు.
ఇడుపులపాయలో ఉన్న ప్రకాశం జిల్లా విద్యార్థుల కోసం ఒంగోలులో అన్ని వసతులు ఉన్న భవనాలు సిద్ధం చేయాలని చెప్పారు. బాలికలకు వసతి సౌకర్యం, వారి భద్రతలో నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎక్కడి విద్యార్థులు అక్కడే విద్యాభ్యాసం చేసేలా స్థానికంగా క్యాంపస్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిధుల కోసం ప్రతిపాదనలు పంపితే పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: