కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపేశారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. గోవాలోనూ ఎన్నికలను వాయిదా వేసే విషయాన్ని అక్కడి అధికారులు చర్చిస్తున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ.... సీఎస్ నీలం సాహ్ని రాసిన లేఖకు ఆయన బదులిచ్చారు. ఎన్నికలకు, ఆర్థిక సంఘం నిధులకు ముడి పెట్టవద్దని సూచించారు. ఆ నిధులు రావడానికి తన వంతు కృషి చేస్తానని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలను వాయుదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మిగిలిన రాష్ట్రాల కన్నా ఒక్కరోజు ముందుగా ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం అనవసర చర్చలకు కారణమైందన్నారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ కార్యదర్శితో ఈనెల 14న సంప్రదించానన్న ఎస్ఈసీ.... కరోనా ప్రభావంపై చర్చించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనాపై శాస్త్రీయ సమాచారం లేదన్నారు. కరోనా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం నేషనల్ టాస్క్ ఫోర్స్ నియమించిందన్నారు. నిర్ణయం తీసుకునే ముందు... కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపినట్లు చెప్పిన ఎస్ఈసీ... వారి సూచనలు, హామీతో రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేసినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాలు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయన్న ఎస్ఈసీ...ఇలాంటి సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంలో ఆంధ్రప్రదేశ్ అతీతం కాదన్నారు. కరోనా వ్యాప్తి వల్ల జరుగుతోన్న అనర్థాలపై సీఎస్ కు తెలియజేస్తున్నట్టు చెప్పారు. అపార్థాలకు తావులేకుండా ఉండేందుకే లేఖ రాస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికలకు, ఆర్థిక సంఘం నిధులకు ముడి పెట్టవద్దని లేఖలో సూచించిన రమేశ్ కుమార్... గతంలో కూడా ఇదే విధంగా ఎన్నికలు నిలిపినా కేంద్ర నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. రాజ్ భవన్ కంటే ముందు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖలో పనిచేసిన అనుభవం తనకు ఉందన్న ఆయన... స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రాంట్లు, నిధులు విడుదల విషయంలో అవగాహనతో ఉన్నట్లు చెప్పారు. ఆర్థిక వ్యవహారాలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. అవసరమైన నివేదికలను ఆర్థిక సంఘానికి అందిస్తామన్నారు.
ఇవీ చదవండి:
ఎన్నికలు నిర్వహించండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సీఎస్ లేఖ