గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో చివరి అంకానికి ముహూర్తం ఖరారైంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 11న కొత్త కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపడతారు.
కోరం తప్పనిసరి...
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం నిర్వహించే సమావేశానికి కోరం తప్పనిసరి. ఎన్నికైన కార్పొరేటర్లతోపాటు ఎక్స్అఫీషియో సభ్యులతో కలిసి సగానికి కంటే ఎక్కువ మంది హాజరైతే కోరం ఉన్నట్లుగా పరిగణిస్తారు. కోరం లేకపోతే మరుసటి రోజే మళ్లీ సమావేశపరిచి ఎన్నిక చేపడతారు. వరుసగా రెండో రోజూ కోరం లేకపోతే ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు.
విప్ వర్తింపు...
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు విప్ వర్తిస్తుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు విప్ జారీ చేసి ఆ విషయాన్ని ఎన్నికల అథారిటీకి తెలపాల్సి ఉంటుంది. ఆయా పార్టీల తరపున ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు విప్‌నకు అనుగుణంగా ఓటువేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా విప్ ధిక్కరిస్తే వారిపై పార్టీల ఫిర్యాదుకు అనుగుణంగా ప్రిసైడింగ్ అధికారి సంబంధిత సభ్యుని సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవచ్చు. సదరు సభ్యుని ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుంది.
చేతులెత్తే విధానంలో...
మేయర్ ఎన్నిక కోసం ఏదైనా పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు ఒకరు ప్రతిపాదించాలి. మరొకరు బలపర్చాల్సి ఉంటుంది. ఒకే అభ్యర్థి పేరును ప్రతిపాదించినట్లైతే ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఫలితాన్ని ప్రకటిస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులను ప్రతిపాదిస్తే సభ్యులు చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహిస్తారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు మేయర్‌గా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఒకవేళ ఇద్దరు సభ్యులకు సమాన సంఖ్యలో ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. ఇదే తరహాలో డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు. మేయర్ ఎన్నిక పూర్తి కాకుండా డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించడానికి వీలు లేదు.
బలబలాలు...
ప్రస్తుత బల్దియా బలాబలాల్లో తెరాసకు 56 మంది కార్పొరేటర్లు, మరో 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి మొత్తం 86 మంది సభ్యులున్నారు. భాజపాకు 47 మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 49 మంది బలం ఉంది. మజ్లిస్‌కు 44 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్ అఫీషియోతో కలిసి 54 మంది సంఖ్యాబలం ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాలంటే కోరం కోసం రెండు పార్టీల సభ్యులు తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుంది.
ఎన్నిక సమయంలో మూడు పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తే తెరాస అభ్యర్థి మేయర్ అవుతారు. తెరాస, భాజపా పోటీ చేసి మజ్లిస్ తటస్థంగా ఉన్నా తెరాస అభ్యర్థి గెలుపు ఖాయం. ఒకవేళ కేవలం తెరాస అభ్యర్థి మాత్రమే పోటీ చేస్తే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.
ఇదీ చదవండి: వారం రోజుల్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్