స్పిల్ వే
పోలవరం ప్రాజెక్టులో కీలక కట్టడం ఇది. మొత్తం పొడవు 1,128 మీటర్లు. 55 మీటర్ల ఎత్తుకు నిర్మిస్తున్నారు. దాదాపు పనులు కొలిక్కి వచ్చాయి. స్పిల్ వే మీద 54.15 మీటర్ల స్థాయిలో రోడ్డు నిర్మించారు. పక్క గోడలతో పాటు గేట్ల నిర్వహణకు అవసరమైన పవర్ ప్యాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 48 గేట్లు. ఇందులో 42 గేట్లు ఇప్పటికే ఏర్పాటు చేశారు. వాటికి జర్మనీ నుంచి తీసుకువచ్చిన హైడ్రాలిక్ సిలిండర్లు బిగించారు. మరో 6 గేట్లకు అవసరమైన సిలిండర్లు వస్తున్నాయి. ప్రస్తుత వరద సీజన్‌లో ఈ గేట్లు అన్నీ పైకి ఎత్తి ఉంచుతారు. వరద నీటిని వచ్చింది వచ్చినట్లే కిందకు పంపుతారు. స్పిల్ వే క్రెస్టు స్థాయి 25.72 మీటర్లు. స్పిల్ వే వెనుక అంతకు మించి నీరు వచ్చిన వెంటనే స్పిల్ వే గేట్ల మార్గంలో నీరు దిగువకు వెళ్లిపోతుంది.
అప్రోచ్ ఛానల్
దీని పొడవు 2.1 కిలోమీటరు. నదిని ఈ మార్గంలోనే మళ్లించారు. 600 మీటర్ల వెడల్పుతో ప్రారంభించి స్పిల్ వే వద్దకు వచ్చే సరికి కిలోమీటరుకు పైగా తవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం 500 మీటర్ల వెడల్పున అప్రోచ్ ఛానల్ తవ్వి గోదావరి నదిని మళ్లించారు. ఇంకా 50 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు తవ్వాల్సి ఉంది.
ఎగువ కాఫర్ డ్యాం
గోదావరి నదికి అడ్డుగా నిర్మించిన ఎగువ కాఫర్ డ్యాం ఇది. మొత్తం దీని పొడవు 2,480 మీటర్లు అంటే రెండు కిలోమీటర్ల కన్నా ఎక్కువ. దీన్ని 42.5 మీటర్ల ఎత్తుకు నిర్మించాలి. ప్రస్తుతం ఇది 20 మీటర్ల నుంచి 35 మీటర్ల ఎత్తు వరకు వివిధ చోట్ల వివిధ దశల్లో ఉంది. జులై నెలాఖరుకు 42.5 మీటర్ల ఎత్తు స్థాయికి నిర్మించాల్సి ఉంది.
రివర్స్ స్లూయిస్ గేట్లు
ప్రస్తుతం స్పిల్ వే లో చివరన రివర్స్ స్లూయిస్ గేట్ల నుంచి నీరు కిందకు వస్తున్న దృశ్యం కనిపిస్తోంది. అక్కడ 10 రివర్స్ స్లూయిస్ గేట్ల తూముల ద్వారా నీరు దిగువకు వస్తోంది. ఈ మార్గంలోనే దిగువకు ధవళేశ్వరం బ్యారేజికి నీటిని మళ్లిస్తున్నారు.
స్పిల్ వే దాటిన తర్వాత నీటితో కనిపిస్తున్న ప్రాంతమే స్పిల్ ఛానల్. ఇక్కడ కాంక్రీటుతో కొంత పని చేశారు. మరికొంత చేయాలి. దీని పొడవు 2.92 కిలోమీటర్లు. దాని తర్వాత పైలట్ ఛానల్ కిలోమీటరు ఉంటుంది. వీటి మీదుగా ప్రయాణించి తిరిగి గోదావరి నీరు సహజ మార్గంలో కలుస్తుంది.
ఇదీ చదవండి: