లాక్‌డౌన్ కారణంగా పనుల్లేక... తినేందుకు తిండిలేక ఇబ్బందులు పడుతున్న వారికి మేముసైతం అంటూ దాతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఉన్నంతలోనే తోచిన విధంగా దానం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మహిళలకు అధికారులు సరుకులు పంపిణీ చేశారు. పేదలకు అరటిపళ్లు అందించారు. విజయనగరం జిల్లా జొన్నగుడ్డిలో లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన వారికి... కథానాయకుడు నాగచైతన్య అభిమానులు.. నిత్యావసరాలు పంపిణీ చేశారు. భోగాపురం మండలం గూడెపువలసలో లక్ష్మణ్ రెడ్డి అనే వ్యక్తి... 8 లక్షల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న జీవీఎంసీ కార్మికులకు... ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వందమంది సిబ్బందికి అల్పాహారం అందించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు... అడ్డరోడ్డు కూడలిలోని చిరు వ్యాపారులకు గొడుగులు, మాస్క్‌లు పంపిణీ చేశారు. పెదవాల్తేరులో రోడ్ల పక్కనే బతుకీడుస్తున్న నిరుపేదలు, యాచకులకు రవికుమార్‌రెడ్డి అనే వ్యక్తి ఆహార పొట్లాలు పంచిపెట్టారు.
తూర్పుగోదావరిజిల్లా రావులపాలెంలో అక్షయ దీపిక స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు 300 మందికి అన్నదానం చేశారు. పేదలకు సేవలందించే పారిశుద్ధ్య కార్మికులు, రోడ్డు చెంత ఉండే యాచకులకు ఆహార పొట్లాలు అందించారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలికి చెందిన అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతువులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. తణుకులో రాత్రీపగలు తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి తణుకు హోటల్స్ అసోసియేషన్ భోజనం ప్యాకెట్లు అందించింది. కృష్ణాజిల్లా తిరువూరులో150 పేద కుటుంబాలకు పీఆర్టీయూ మండలశాఖ లక్ష రూపాయలు విలువ చేసే నిత్యావసరాలు పంపిణీ చేసింది. గుంటూరులో పేదలకు ఆహారం పెడుతున్న అమ్మ ఛారిటబుల్ ట్రస్టు వారికి మోతడక గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ నిమ్మగడ్డ అఖిల్.. లక్ష రూపాయల విరాళం అందించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందించారు .
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి పదివేల మంది పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మిగిలిన మూడు మండలాలకు కూడా అందించనున్నట్లు తెలిపారు. కర్నూల్లో పేదలకు ఏపీటీఎఫ్ ఆధ‌్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఆలూరులో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్... 50 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో వలస కార్మికులకు అయ్యప్పస్వామి సేవా సమితి సభ్యులు... నిత్యావసర సరుకులు అందించారు. 35 కుటుంబాలు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఆహారం అందించామన్న సేవా సమితి సభ్యులు తెలిపారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో 75 కుటుంబాలకు నిత్యావసరాలను ఉచితంగా అందించారు.
ఇవీ చదవండి: రూ.600తో 20 నిమిషాల్లోపే కరోనా పరీక్ష ఫలితాలు