తగ్గిన చలామణి:
అప్పట్లో రెండు వేల నోట్లు 3,542.991 మిలియన్ నోట్లను ముద్రించారు. 2017-18 ఆర్థిక ఏడాదిలో 111.5 మిలియన్ల రెండు వేల రూపాయల నోట్ల ముద్రణకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. ఇక 2018-19 ఆర్థిక ఏడాదిలో కేవలం 46.690 మిలియన్లు ముద్రించారు. అయితే 2019-20లో ఇప్పటి వరకు ఆర్బీఐ నుంచి నాసిక్‌లోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌కు ఎలాంటి ఆర్డర్ రాలేదు. 2018 మార్చి చివర నాటికి 3,363 మిలియన్ల నోట్లు చలామణిలో ఉండగా ఈ ఏడాది మార్చి చివర నాటికి 3,291 నోట్లు చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
కారణాలేంటి ?
ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇలా రెండు వేల రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరణ దిశగా ముందుకెళ్లడానికి అనేక కారణాలు ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా రెండు వేల నోట్లు చలామణిలోకి వచ్చినప్పటి నుంచి "హవాలా''కు వీటిని వినియోగించడం పెరిగిపోయింది. అదే విధంగా నల్లధనం కింద ఈ నోట్లను దాచడం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక నకిలీ నోట్లను చలామణిలోకి విచ్చలవిడిగా తీసుకురావడం వంటి కారణాలు చాలానే ఉన్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో రూ.50 కోట్లు నకిలీ రెండువేల నోట్లను దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్నట్లు ఇటీవల లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే 2017-18 ఆర్థిక ఏడాదిలో 17,929 రెండు వేల రూపాయల నకిలీ నోట్లను గుర్తించినట్లు సెంట్రల్ బ్యాంకు పేర్కొంది. వీటితోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ నాణ్యమైన నకిలీ రెండు వేల నోట్లు చలామణిలోకి వచ్చినట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకొని క్రమంగా నోట్లను వెనక్కి తీసుకోవాలన్న దిశలో భారత ప్రభుత్వం భావిస్తోంది.