Dignity for women: నగ్న వీడియో వ్యవహారంలో వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని.. డిగ్నిటీ ఫర్ ఉమెన్ ఐకాస నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. మహిళల ఆత్మగౌరవాన్ని మాధవ్ కించపరిచారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. మాధవ్‌ను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గోరంట్ల మాధవ్ వ్యవహారం జరిగి ఇన్ని రోజులైనా చర్యలు తీసుకోలేదని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు.
గతంలో గవర్నర్‌ను కలిసిన మహిళ ఐకాస నేతలు: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంతో పాటు మూడేళ్లుగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అఖిలపక్షాల మహిళా ఐకాస నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నెల 12వ తేదీన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అఖిలపక్షాల మహిళా ఐకాస నేతలు.. నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించిన ప్రజా ప్రతినిధులపై చర్యలు ఉండకపోవటంతో పాటు అధికారులు, మంత్రులు తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తున్న తీరును వివరించారు. కేంద్ర ఫోరెన్సిక్కి ఎంపీ వీడియో వ్యవహారం అప్పగించాలని కోరారు. ప్రజా ప్రతినిధులు మహిళల పట్ల ఎలా ఉండాలనే దానిపై శిక్షణ తరగతులు ఉండాలని సూచించారు.
మహిళా కమిషన్, డీజీపీకి లేఖ: ఈ వ్యవహారంపై తక్షణం విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని మహిళా కమిషన్ డీజీపీకి లేఖ రాసింది. విచారణ జరిపి ఎంపీ గోరంట్లపై చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. మహిళాలోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆమె డీజీపీని కోరారు.
MP Gorantla Madhav video viral: ఏం జరిగిందంటే..: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఒకటి కలకలం రేపింది. ఆగస్టు 4న (గురువారం) ఉదయం 8 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఈ వీడియో.. కొద్దిసేపటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడటాన్ని రికార్డు చేసి, ఆ వీడియోను మరో ఫోన్‌తో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 3వ తేదీ బుధవారం రాత్రి ఫేస్‌బుక్ మెసెంజర్‌లో తొలుత ఈ వీడియో వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాసేపటికి ట్విటర్‌లోనూ కొంతమంది దాన్ని షేర్ చేశారు. గురువారం ఉదయం ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దీనిపై గోరంట్ల మాధవ్ స్పందిస్తూ ఆ వీడియో నకిలీది అనీ, తాను జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను మార్ఫింగ్ చేశారని చెప్పారు. ఇదంతా తెదేపా, కొంతమంది మీడియా వ్యక్తుల కుట్ర అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు.
ఇవీ చదవండి: