ఒడిశా వెంబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామల్లోని విద్యార్థులకు ఒడియా భాషా బోధనను అందించేందుకు ఎపీ సీఎం జగన్ చొరవ తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ విషయమై సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు.
ఇరు రాష్ట్రాల సరిహద్దులోని గ్రామాలు రెండు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల్ని పంచుకుంటున్నాయని అన్నారు. అందువల్ల తెలుగు, ఒడియా భాషా విధానాన్ని ఇరు రాష్ట్రాలు ఆయా విద్యార్థులకు అనుగుణంగా అందించాలన్నారు.
"ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఉండే తెలుగు విద్యార్థుల కోసం ఒడిశా ప్రభుత్వం ఆయా విద్యార్థులకు తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో ఒడియా నేర్చుకోవాలనుకునే వారికి ఒడియా భాషను ఏపీ ప్రభుత్వం అందించడం లేదు. అంతేకాకుండా ఒడియా మీడియంలో చదివే పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఇంతవరకు పుస్తకాలు అందివ్వలేదని నా దృష్టికి వచ్చింది. తెలుగు విద్యార్థుల కోసం ఒడిశా ప్రభుత్వం చేసినట్లుగానే ఏపీ ప్రభుత్వం.. ఒడియా మాట్లాడే విద్యార్థుల కోసం ఒడియా భాషను మాధ్యమంగా, పాఠ్యాంశంగా అందివ్వాలి" -ధరేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి
సరిహద్దులో ఉండే తమ భాషను నేర్చుకోవాలనే, ఆ మాధ్యమంలో చదువుకోవాలనే విద్యార్థుల కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చి, సమస్యను పరిష్కరించాలని కేంద్ర మంత్రి సూచించారు.
ఇదీ చదవండి: Group-1 mains results: మాన్యువల్‌గా మూల్యాంకనం చేసి.. ఫలితాలివ్వండి: హైకోర్టు