తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మలను దర్శించుకున్నారు. మేడారం పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. జంపన్న వాగు దగ్గర భక్తుల సందడి కనిపించింది. వాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల వద్దకు బయలుదేరారు. ఇలవేల్పులుగా భావించే తల్లులను పసుపు కుంకుమలతో పూజించి... బంగారాన్ని కానుకగా సమర్పించి పూజలు చేశారు.
ఈ నెల 24 నుంచి
పెద్ద జాతర జరిగిన మరుసటి సంవత్సరం చిన్నజాతరను నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 24 నుంచి నాలుగు రోజులపాటు చిన్న జాతరను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. జాతర రోజుల్లో రద్దీ ఉంటుందని భావించి... భక్తులు ఇప్పట్నుంచే మేడారానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
భక్తుల ఇబ్బందులు
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. పొరుగు రాష్ట్టాలైన చత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు కుటుంబసమేతంగా అమ్మల దర్శనం కోసం బారులు తీరారు. ఒడిబియ్యం, పూలూపళ్లు, నూతనవస్త్రాలు సమర్పించి... తిరుగుపయనమవుతున్నారు. ఐదు లక్షల మంది వస్తారన్న అంచనాలకు తగ్గట్లు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం తదితర పనులు నత్తనడకన సాగడం వల్ల భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నారు.
రద్దీతో పరిసరాలు
ప్రైవేటు వాహనాల రద్దీతో మేడారం పరిసరాలు నిండిపోతున్నాయి. భక్తుల రాక దృష్ట్యా దుకాణదారుల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. కొబ్బరికాయలు, పండ్లు, పూలు, బెల్లానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది.
నిబంధనలు కఠినతరం
చినజాతరలో వీలైనంత త్వరగా సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. విశేషంగా తరలివస్తున్న ప్రజలు... కరోనా జాగ్రత్తలు పాటించే విధంగా నిబంధనలు కఠినతరం చేయాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి : కేరళలో పంచాయతీలు.. స్వర్గ సీమలే!