'సీఐడీ కార్యాలయంలో తొమ్మిది గంటల పాటు నన్ను కూర్చోబెట్టి విచారించే బదులు... వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని విచారిస్తే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్ అయిన వై.ఎస్.వివేకానందారెడ్డిని ఎవరు హత్య చేశారో తెలిసేది’’ అని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వివేకా మృతి సమాచారం బయటకొచ్చిన కొద్ది నిమిషాల్లోనే అది గొడ్డలిపోటు కాదు.. గుండెపోటని విజయసాయిరెడ్డి ఎలా చెప్పారో విచారించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేయని వ్యాఖ్యలు చేసినట్లు ఉన్న మార్ఫింగ్ వీడియోను ప్రదర్శించారన్న ఫిర్యాదుపై ఆయనపై నమోదైన కేసు విచారణలో భాగంగా శనివారం దేవినేని ఉమా సీఐడీ అధికారులు ముందు హాజరయ్యారు.
మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ దాదాపు 9 గంటల పాటు ఆయన విచారణ కొనసాగింది. బయటకొచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు మరోమారు విచారణకు హాజరవ్వాలని చెబుతూ సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులిచ్చారని వివరించారు. సీఆర్‌పీసీ91 కింద మరో నోటీసు ఇచ్చారన్నారు. ‘‘సీఐడీ కార్యాలయంలో నా విచారణ కొనసాగుతుండగా.. అందుకు సంబంధించిన అంశాలపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. లోపల జరిగే విషయాలు బయటకి ఎలా వచ్చాయి? వీటిపై హైకోర్టును ఆశ్రయిస్తా’’ అని వివరించారు.
దేవినేని ఇంకా ఏమన్నారంటే!
- మా పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ, భద్రతను తీసేసిన పోలీసు అధికారులందర్నీ గుర్తించుకుంటున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారిని ఎలాంటి భద్రత లేకుండా ఒడిశా తదితర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నియమిస్తాం. స్వామిభక్తి, అత్యుత్సాహంతో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న అధికారులందరికీ భవిష్యత్తులో ఇదే తరహాలో సమాధానం చెబుతాం.
- విచారణ సందర్భంగా నా ముందు కూర్చున్న పదిమంది పోలీసుల్లో నలుగురు దగ్గుతూ కనిపించారు. జగన్‌ను విమర్శించే తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టి.. ఇబ్బందులుకు గురిచేసేందుకే సీఐడీ పనిచేస్తోంది.
- ఇప్పుడే కాదు.. ఇంకెన్ని సార్లు నోటీసులిచ్చినా సీఐడీ విచారణకు హాజరవుతా. ఈ ప్రభుత్వ తప్పిదాలను, లోపాల్ని విమర్శిస్తూనే ఉంటా.
- ధాన్యపు రైతుల నుంచి జే ట్యాక్స్ రూపంలో రూ.2 వేల కోట్లు కొట్టేస్తున్నారు. తాడేపల్లి రాజప్రసాదంలోని సజ్జల రామకృష్ణారెడ్డి వీటిని వసూలు చేస్తున్నారు.
- జగన్‌కు దమ్ముంటే విజయవాడ, గుంటూరు ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలి.
ఇదీ చదవండి: