ఏ గ్రూపులో ఏముంది?
ఇంటర్మీడియట్‌లో విద్యార్థి చేరిన గ్రూపును బట్టి 3-4 సబ్జెక్టులు ఉంటాయి. వీటితోపాటు ఆంగ్లం, మరో భాష ఎంచుకోవడం తప్పనిసరి. విద్యార్థులు ముందుగా ఇంటర్మీడియట్ గ్రూపుల వారీ ఉన్న అవకాశాలు, ప్రత్యేకతలు తెలుసుకుంటే ఎందులో చేరవచ్చో నిర్ణయం తీసుకోవడం సులువవుతుంది.
- ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
ఏపీ, తెలంగాణల్లో ఎక్కువమంది విద్యార్థులు ఎంచుకుంటోన్న గ్రూపు ఇదే. భవిష్యత్తులో బీఈ/ బీటెక్, బీఆర్క్ కోర్సులు చదవాలని ఆశించేవారు ఇంటర్‌లో ఎంపీసీ తీసుకోవడం తప్పనిసరి. అలాగే పైలట్ కావాలన్నా ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదవాలి. ఫ్యాషన్ టెక్నాలజీ దిశగా అడుగులేయడానికీ గణిత నేపథ్యం ఉండాల్సిందే. ఎంపీసీ గ్రూపుతో ఇంటర్ పూర్తిచేసుకున్నవారు బీఎస్సీలోనూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల కాంబినేషన్ ఎంచుకోవచ్చు లేదా స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, జియాలజీ...ఇలా కొత్త సబ్జెక్టులూ తీసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, బీఎస్-ఎంఎస్, డీఎడ్, లా, డిజైన్, ఫార్మసీ..ఇలా ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి.
ఇదే విద్యార్హతతో ప్రత్యేకంగా కొలువులూ లభిస్తున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల్లో పలు ఉద్యోగాలకు ఇంటర్ ఎంపీసీ అర్హతతో పోటీ పడే అవకాశం లభిస్తుంది. ఆర్మీ, నేవీల్లో 10+2 టెక్ ఎంట్రీతో ఉచితంగా బీటెక్ చదువుకుని లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగాన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్‌లో మ్యాథ్స్‌పై ఆసక్తి తగ్గితే బీఏ, బీకాం, బీబీఏ, బీబీఎం, బీఎస్సీ హోటల్ మేనేజ్‌మెంట్, సీఏ, సీఎస్, సీఎంఏ...మొదలైనవాటిలోనూ చేరవచ్చు.
* మ్యాథ్స్, ఫిజిక్స్ రెండు సబ్జెక్టులపైనా ఆసక్తి, ఎంతో కొంత ప్రావీణ్యం ఉన్నవారు ఇంటర్ ఎంపీసీ గ్రూపు ఎంచుకోవచ్చు.
* మొక్కలు, జంతువులు, వైద్యరంగం వీటిలో దేనిపై ఆసక్తి ఉన్నా బైపీసీ తీసుకోవాలి.
* అంకెలు, వర్తకరంగం, మదింపు...తదితర అంశాలు ఇష్టమైతే అకౌంట్స్ దిశగా అడుగులేయాలి.
* చరిత్ర, సమకాలీన సంఘటనల గురించి తెలుసుకోవాలనుకున్నవారు ఆర్ట్స్ కోర్సులు తీసుకోవటం మేలు.
- బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
వైద్య వృత్తి, అనుబంధ విభాగాల్లో సేవలు అందించడానికి ఇంటర్‌లో బయాలజీ (బోటనీ, జువాలజీ), ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి. అలాగే వ్యవసాయ కోర్సులు, బీఎస్సీ నర్సింగ్, కొన్ని పారామెడికల్ కోర్సుల్లో చేరడానికి బైపీసీ గ్రూపుతో ఇంటర్ పూర్తిచేయాలి. ఫిషరీ సైన్స్, ఆక్వా, మైక్రో బయాలజీ మొదలైన కోర్సులకు బైపీసీ అనివార్యం. వీరు ఫిజిక్స్ మినహాయించి ఇంటర్‌లో చదివిన సబ్జెక్టులతోనే బీఎస్సీలో చేరవచ్చు లేదా మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్...తదితర కొత్త సబ్జెక్టులను డిగ్రీ స్థాయిలో ఎంచుకోవచ్చు. బైపీసీ విద్యార్థులు ఫార్మసీ, ఆప్టోమెట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, డీఎడ్, లా, డిజైన్, హోటల్ మేనేజ్‌మెంట్...తదితర కోర్సుల్లో చేరవచ్చు. ఇంటర్ తర్వాత కొన్ని డిప్లొమా, బ్యాచిలర్ కోర్సులు పూర్తిచేసుకుని సొంతంగా రాణించవచ్చు.
- ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్)
గణాంకం, వర్తక, వాణిజ్య రంగాల్లో రాణించాలని అభిలషించేవారికి ఎంఈసీ మేటి కోర్సు. ఈ గ్రూపు విద్యార్థులకోసమే అంటూ ప్రత్యేకమైన చదువులు ఏమీ లేనప్పటికీ చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ ఎకౌంటెంట్ (సీఎంఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్) హోదాల్లో రాణించడానికి ఎంఈసీ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మేనేజ్‌మెంట్ కోర్సులు చదవాలనుకునేవాళ్లు ఎంఈసీ దిశగా అడుగులేయవచ్చు. బిజినెస్ ఎనలిస్ట్, స్టాటిస్టీషియన్, మార్కెట్ నిపుణులు...మొదలైన రంగాలకు మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టుల నేపథ్యం పనికొస్తుంది. వీరు ఉన్నత విద్య (డిగ్రీ)లో భాగంగా మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల కాంబినేషన్ ఎంచుకోవచ్చు. లేదా బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, డీఎడ్, లా, హోటల్ మేనేజ్‌మెంట్...మొదలైన కోర్సుల్లోనూ చేరిపోవచ్చు. ఎకనామిక్స్‌పై పట్టున్నవారికి సైన్స్ కోర్సులతో సమాన అవకాశాలు లభిస్తున్నాయి.
- సీఈసీ (కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్)
ఎకనామిక్స్, కామర్స్ కలయికతో ఉండే ఈ కోర్సు చదివినవాళ్లు అకౌంటింగ్ రంగంలో రాణించవచ్చు. వీరు భవిష్యత్తులో సీఏ, సీఎంఏ, బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సుల్లో చేరి ప్రయోజనం పొందవచ్చు. అలాగే న్యాయవిద్య, ఉపాధ్యాయ విద్య, హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం స్టడీస్ అభ్యసించవచ్చు. బీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ, డీఎడ్, ఇంటిగ్రేటెడ్ బీఏఎడ్, ఇంటిగ్రేటెడ్ బీఏఎల్‌ఎల్‌బీ కోర్సులు సైతం ఈ గ్రూపు విద్యార్థులకు అనువైనవి.
- హెచ్‌ఈసీ (హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్)
గ్రూప్స్, సివిల్స్ లాంటి పోటీ పరీక్షలు రాయడానికి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టుల కాంబినేషన్ పనికొస్తుంది. వీరు ఇంటర్ తర్వాత బీఏలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, ఆంత్రొపాలజీ, సైకాలజీ, జాగ్రఫీ, విదేశీ భాషలు... ఇలా నచ్చిన సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. టూరిజం స్టడీస్, హోటల్ మేనేజ్‌మెంట్ వీరికి అనువైనవిగా చెప్పుకోవచ్చు. న్యాయవాద వృత్తి, బోధన రంగంలోనూ హెచ్‌ఈసీ వాళ్లు రాణించగలరు. అందువల్ల ఇంటర్ తర్వాత డీఎడ్ లేదా ఇంటిగ్రేటెడ్ బీఏబీఎడ్; బీఏ బీఎల్ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యమివ్వవచ్చు. ఈ గ్రూపు విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీలు అందిస్తోన్న ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సుల్లో చేరడం ద్వారా మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పదో తరగతి పూర్తిచేసుకున్న ఎక్కువమంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కోర్సుల్లోనే చేరుతున్నారు. భవిష్యత్తులో ఇంజినీర్లు, వైద్యులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లుగా రాణించడానికి ఇంటర్ చదువులు పునాదిగా నిలుస్తాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే ఐఐటీ-జేఈఈ, నీట్, క్లాట్; రాష్ట్ర స్థాయిలోని ఎంసెట్, డైట్‌సెట్, లాసెట్ వీటన్నింటికీ ఇంటర్ కోర్సులే ఆధారం.
తెలుగు రాష్ట్రాల్లో 85 గ్రూపు కాంబినేషన్లతో ఇంటర్మీడియట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో మ్యాథ్స్, ఫిజిక్స్; బోటనీ, జువాలజీ; హిస్టరీ, ఎకనామిక్స్.. లాంటి ప్రాచుర్యం పొందిన గ్రూపుల్లోనే ఎక్కువమంది విద్యార్థులు చేరుతున్నారు. వీటిని దాదాపు అన్ని ప్రభుత్వ కళాశాలలూ అందిస్తున్నాయి. కొన్ని చోట్ల లాజిక్, మ్యూజిక్, సైకాలజీ, సోషియాలజీ...లాంటి సబ్జెక్టులనూ బోధిస్తున్నారు.
- రాణించాలంటే...
సామర్థ్యాలు, ఆసక్తులకు అనుగుణంగా ఉన్న గ్రూపును ఎంచుకుంటే అందులో రాణించడం సులువవుతుంది. ఇందుకు స్వీయ సమీక్షే కొలమానం కావాలి. సరైన అవగాహనతో అడుగులేస్తే మేటి నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుంది. సరైన నిర్ణయానికి రాలేనివాళ్లు పదో తరగతిలో సబ్జెక్టులవారీ సాధించిన మార్కులు/గ్రేడ్ పాయింట్లను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఏ అంశాలను బాగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు, ఏ సబ్జెక్టు ఎక్కువ ఆసక్తికరంగా ఉంది, ఏ సబ్జెక్టు ఆనందాన్నిస్తుంది, ఏ సబ్జెక్టును చాలా సౌకర్యవంతంగా భావిస్తున్నారో గుర్తించి, అటు వైపు మొగ్గు చూపవచ్చు.
కెరియర్ లక్ష్యం ఏమిటి? అందుకు ఏ కోర్సులు (సబ్జెక్టులు) చదవాలి? ఆ సబ్జెక్టులపై ఆసక్తి ఉందా? లేదా?.. ఇవి విశ్లేషించుకోవాలి. సంబంధిత సబ్జెక్టులపై ఆసక్తి లేకపోతే లక్ష్యాన్ని మార్చుకోవాలి లేదా ఆ సబ్జెక్టుల్లో ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలి. ఉదాహరణకు ఇంజినీర్ కావాలని ఆశించే వ్యక్తికి మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే ఇష్టం లేకపోతే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అందువల్ల ఏ మాత్రం ఇష్టంలేని సబ్జెక్టుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇదే వ్యక్తికి మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో పట్టు లేకపోయినప్పటికీ వాటిని నేర్చుకోవాలనే ఆసక్తి, తపన ఈ రెండూ ఉంటే ఎంపీసీ గ్రూపు ఎంచుకోవచ్చు. ఇలా నైపుణ్యాలు, ఆసక్తులను పరిగణనలోకి తీసుకోవాలి.
హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ హాస్పిటాలిటీ, డిజైన్, టూరిజం అండ్ ట్రావెల్, యానిమేషన్, బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఫైన్ ఆర్ట్స్...ఇలా పలు కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ అన్ని గ్రూపుల విద్యార్థులకూ సమాన అవకాశం ఉంది.
భవిష్యత్తులో సీఏ, సీఎస్, సీఎంఏల్లో ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సు పూర్తిచేయాలని నిర్ణయించుకున్నవారు ఎంపీసీ, ఎంఈసీ ఈ రెండింటిలో ఏది తీసుకోవాలనే సందిగ్ధంలో ఉంటారు. అయితే ఈ ప్రొఫెషనల్ కోర్సులపై స్పష్టమైన లక్ష్యం ఉన్నవాళ్లు ఎంఈసీ లేదా సీఈసీ గ్రూపులో చేరడమే ఉత్తమం. వీటిలో ఉండే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ పాఠ్యాంశాలు సీఏ, సీఎస్, సీఎంఏ ఫౌండేషన్ నిమిత్తం పనికొస్తాయి. అదే ఎంపీసీ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఉపయోగం ఉండదు.
కళాశాలకు నేరుగా వెళ్లి ప్రత్యక్షంగా చదవడం వీలుకానివాళ్లు నేషనల్ / స్టేట్ ఓపెన్ స్కూలింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. రెగ్యులర్ విధానంలో ఉన్నట్లుగానే ఇక్కడ పలు సబ్జెక్టు కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఇంటర్‌తో సమాన గుర్తింపు దక్కుతుంది.
ఏ వృత్తిలో ఎలా?
పైలట్: మ్యాథ్స్, ఫిజిక్స్‌తో ఇంటర్‌లో చేరాలి.
ఇంజినీర్: ఇంటర్ ఎంపీసీ లేదా మూడేళ్లడిప్లొమా
డాక్టర్: ఇంటర్ బైపీసీ లాయర్, టీచర్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్, కంపెనీ
సెక్రటరీ: ఏ గ్రూపుతోనైనా ఇంటర్
ఇదీ చూడండి: