Polavaram projects works: ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చెప్పదగ్గ కదలిక లేకున్నా శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటనతో నిపుణులు విస్మయం చెందుతున్నారు. రాష్ట్రప్రభుత్వ జలవనరులశాఖ అధికారుల నివేదికలను పరిగణనలోకి తీసుకుని ఈ మూడేళ్లలో ఏం జరిగిందని పరిశీలిస్తే కేవలం ప్రధాన డ్యాం నిర్మాణంలో 12% పనులే చేసినట్లు తెలుస్తుంది. ఎడమ కాలువ పనుల్లో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. కుడి కాలువ నిర్మాణం 2019 నాటికే దాదాపు పూర్తయింది. ఆ తర్వాత 2% లోపు పనులే జరిగాయి. భూసేకరణ, పునరావాసం అడుగు ముందుకు పడింది లేదని, ఇక్కడి నిర్వాసిత గిరిజనులు విలవిల్లాడుతున్నారని జాతీయ ఎస్టీ కమిషన్ ఎత్తిచూపింది. 2020, 2021 వరదల సమయంలో పోలవరం నిర్వాసితులు గూడు లేక అల్లాడారు.
మూడేళ్లలో పునరావాసంలో పడ్డ అడుగులు అంతంత మాత్రమేనని ప్రభుత్వ నివేదికలే పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మూడేళ్లలో పోలవరంలో ఎంతో చేసినా తాము ఏమీ ఘనంగా చెప్పడం లేదంటూ ప్రభుత్వం శాసనసభలో ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ నివేదికలు ఏం చెబుతున్నాయో చూస్తే... రెండు నివేదికలను పోల్చి చూస్తే.. రెండు నివేదికల్లోని లెక్కలను పోల్చి చూస్తే తేలిన విషయం ఇదేనని విశ్రాంత జలవనరులశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 2014 నుంచి 2019 వరకు రూ.11,537 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని 2019 జూన్‌లో సీఎంకు ఇచ్చిన నివేదికలో ఉంది. 2019లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ మూడేళ్లలో చేసిన ఖర్చు రూ.2,486.20 కోట్లు. ప్రభుత్వం మాత్రం ఈ మూడేళ్లలో ఎంతో చేశామని ప్రకటించుకోవడం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది.
పునరావాసం మాటేమిటి?
పునరావాసానికి 2019 నాటికి మొత్తం 1,10,823.92 ఎకరాలు సేకరించినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ మూడేళ్ల అనంతరం మొత్తం భూసేకరణ 1,12,555 ఎకరాలు మాత్రమే. అంటే ఈ మూడేళ్లలో కొత్తగా సేకరించిన భూమి రెండువేల ఎకరాల లోపే!
ఇదీ చదవండి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇసుక వివాదం.. డయాఫ్రం వాల్ పనులకు ఆటంకం